Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Burning Topic: మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు

Burning Topic: మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు

hmtv 4 days ago

Burning Topic: మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు

Burning Topic: కేంద్ర ప్రభుత్వం మరోసారి వాహనదారులకు షాక్ ఇచ్చింది. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి పెట్రోల్ ధరలను పెంచేశారు.

దేశ వ్యాప్తంగా లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై దాదాపు 90 పైసలు పెంచుతూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు మళ్లీ పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చేశాయి. యుద్ధం కారణంగా ఐఓసీ, బీపీసీఎల్. హెచ్‌పీసీఎల్ కంపెనీలు అధిక ధరలకు ముడి చమురు కొంటున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరాయి. భారత్ ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతి దేశాల్లో ఒకటి కావడంతో అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ ధరలపై పడుతోంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం, హర్ముజ్‌ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది.

దేశ వ్యాప్తంగా తాజాగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మే 2022 తర్వాత గరిష్ఠ స్థాయికి చేరాయి. ఏప్రిల్‌ 2022 తర్వాత ధరలు పెరగలేదు. అయితే 2024 మార్చిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు లీటరుకు రూ.2 చొప్పున తగ్గించారు. మే 15 నాడు లీటర్, పెట్రోల్ డీజిల్‌లపై రూ.3 చొప్పున అదనపు భారం మోపడం తెలిసిందే. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కొత్తగా అమలులోకి వచ్చిన ధరలు దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో వ్యాట్‌ పన్నుల్లో తేడాల కారణంగా వేర్వేరుగా ఉన్నాయి. కొత్తగా అమలులోకి వచ్చిన ధరలు ఇలా ఉన్నాయి..

ఢిల్లీ: పెట్రోల్‌ రూ.98.63, డీజిల్‌ రూ.91.50

ముంబై: పెట్రోల్‌ రూ.107.40, డీజిల్‌ రూ.93.86

కోల్‌కతా: పెట్రోల్‌ రూ.109.31, డీజిల్‌ రూ.95.85

చెన్నై: పెట్రోల్‌ రూ.104.66, డీజిల్‌ రూ.96.22

బెంగళూరు: పెట్రోల్‌ రూ.106.82, డీజిల్‌ రూ.94.82

హైదరాబాద్‌: పెట్రోల్‌ రూ.111.36, డీజిల్‌ రూ.99.53

విజయవాడ: పెట్రోల్ రూ. 114.48, డీజిల్ రూ. 102.17

మరోవైపు ప్రైవేట్‌ ఇంధన విక్రయ సంస్థలు ఇప్పటికే ధరలు పెంచాయి. నయారా ఎనర్జీ మార్చిలో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచింది. షెల్ ఏప్రిల్‌ 1 నుంచి పెట్రోల్‌పై రూ.7.41, డీజిల్‌పై రూ.25 పెంపు చేసింది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు మే 15 ధరల పెంపుతో నష్టాలు నాలుగో వంతు తగ్గాయని చెప్పారు. అయినా చమురు సంస్థలు రోజుకు సుమారు రూ.750 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. హర్ముజ్‌ ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. .ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగినా, వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకే ఇంధన ధరలను నిలిపివేశామని కేంద్రం చెబుతోంది. అయితే కీలక రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ధరలు పెంచలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే అమెరికా మరోసారి రష్యా చమురుపై ఆంక్షలను సడలించింది. ఏప్రిల్ 17 నుంచి సముద్రంలో నిలిచిపోయిన రష్యా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలకు మరో నెల గడువు ఇచ్చింది. ఈ మినహాయింపును జూన్ 17 వరకు పొడిగిస్తూ అమెరికా ఆర్థిక శాఖకు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎఫ్ఏసీ) ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరిగి.. చమురు దిగుమతులపై ఆధారపడే పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అదనపు సరఫరాలకు అవకాశం కల్పించేందుకు అమెరికా మార్చి నెలలో తొలిసారిగా రష్యా చమురుపై ఆంక్షల మినహాయింపును ప్రకటించింది.అయితే ఈ మినహాయింపు అందరికీ వర్తించదని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా, అలాగే ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమిత ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, సంస్థలు లేదా జాయింట్ వెంచర్లకు ఈ సడలింపు వర్తించదని తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu