Burning Topic: మోదీ ఇటలీ టూర్ వెనుక అసలు కారణం ఇదే?
Burning Topic: ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇటలీ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది.
రోమ్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శలను వీక్షించడంతో పాటు వారితో ముచ్చటించారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంత కాలంగా భారత్, ఇటలీల మధ్య సంబంధాలు మరింతగా బలపడ్డాయి. జార్జియా మెలోనీతో సమావేశమైన మోదీ. 'భారత్-ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29' గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఒక ఆచరణాత్మక, భవిష్యత్ ఆధారిత నిర్మాణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇరుదేశాల నాయకుల మధ్య పెరుగుతున్న నిరంతర చర్చలు, సమావేశాలు ఇరుపక్షాల మధ్య బలపడుతున్న సహకారానికి, పరస్పర నమ్మకానికి నిదర్శనమని మోదీ అన్నారు.
కొన్ని నెలల క్రితం ఖరారైన భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మోదీ, మెలొనీ నిర్ణయానికి వచ్చారు. ఆ ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. భారత్, ఇటలీ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేర్చినందుకు చాలా సంతోషిస్తున్నానని తెలిపారు. భారత్-ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం విదేశాంగ మంత్రుల నేతృత్వంలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, ఇంధనం, కృత్రిమ మేధ, అరుదైన సాంకేతికతలు, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల విషయంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యమని తెలిపారు
పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2029 నాటికల్లా 20 బిలియన్ యూరోలకు చేర్చాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి.
ఇటలీ రాజధాని రోమ్‌లో ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్ఠాత్మక అగ్రికోలా మెడల్-2026 ప్రదానం చేశారు.భారతదేశం ఆహార భద్రత, స్థిరమైన వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి దిశగా చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం ఇచ్చినట్లు FAO డైరెక్టర్ జనరల్ క్వ్ డాంగ్యూ తెలిపారు. ఈ గౌరవాన్ని దేశ రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు అంకితం చేస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతదేశంలో వ్యవసాయం కేవలం పంటల ఉత్పత్తి మాత్రమే కాదని, అది భూమాతతో ఉన్న పవిత్ర బంధమని మోదీ తన ప్రసంగంలో చెప్పారు. "భారతీయ సంస్కృతిలో భూమిని తల్లిగా భావిస్తారు. రైతును భూమిపుత్రుడిగా గౌరవిస్తారు. వేల ఏళ్ల సంప్రదాయం నేటి వ్యవసాయ విధానాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది" అని తెలిపారు. శాస్త్రసాంకేతికత ఆధారంగా వ్యవసాయాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్చుతున్నామని మోదీ వివరించారు.
ప్రధాని మోదీ ఇటలీ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో స్నేహం వార్తల్లో ప్రధానాంశంగా మారిపోయింది. మోదీకి ఆమె ప్రత్యేక విందు ఇచ్చారు. ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్‌కు చేరుకున్న నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు ఇటలీ ప్రధాని మెలోనీ. ఆ తర్వాత మోదీకి ఆమె విందు ఇచ్చారు. అనంతరం ఇరువురు నేతలు ప్రతిష్టాత్మక కొలెసియంను సందర్శించి అక్కడ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను మెలోనీ ఎక్స్‌లో పంచుకొని రోమ్‌కు స్వాగతం మిత్రమా రాసుకొచ్చారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపుభారత ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలోనికి 'మెలోడీ టాఫీ'లను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు మెలోనీ. 'ప్రధాని మోదీ నాకు ఒక బహుమతి తెచ్చారు. అది చాలా చాలా మంచి టాఫీ. గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. ఈ వీడియోలో మోదీ, మెలోని ఇద్దరూ మెలోడీ టాఫీలతో నిండిన ప్యాకెట్‌ను పట్టుకుని ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (Modi Melony Selfy)

