Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Cabinet Meeting: తెలంగాణలో సరికొత్త అధ్యాయం: తొలి 'ఈ-క్యాబినెట్' భేటీకి సర్వం సిద్ధం!

Cabinet Meeting: తెలంగాణలో సరికొత్త అధ్యాయం: తొలి 'ఈ-క్యాబినెట్' భేటీకి సర్వం సిద్ధం!

hmtv 2 weeks ago

Cabinet Meeting: తెలంగాణలో సరికొత్త అధ్యాయం: తొలి 'ఈ-క్యాబినెట్' భేటీకి సర్వం సిద్ధం!

Cabinet Meeting: తెలంగాణ పాలనలో సరికొత్త అధ్యాయం నమోదు కాబోతుంది.

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశం.. రాష్ట్ర చరిత్రలోనే తొలి కాగిత రహిత ఈ-క్యాబినెట్ సమావేశంగా రికార్డుకెక్కనుంది. ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై కేబినెట్ భేటీలను ఈ-క్యాబినెట్ విధానంలో నిర్వహించేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎస్‌ సంజయ్‌ జాజు పర్యవేక్షణలో తొలి సమావేశం జరగనుంది.

ఈ హైటెక్ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ.. కేంద్రం వైఖరి, మెట్రో తదుపరి కార్యాచరణ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, ప్రాజెక్టు వేగవంతం చేసే చర్యలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలను దృష్టిలో ఉంచుకొని.. తర్వాత చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇక కోర్ అర్బన్ ఏరియాలో ప్రతిపాదిత ఎస్ఐజీ హౌసింగ్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే గుర్తించిన 26 స్థలాలు, డిజైన్లు, విధివిధానాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ప్రస్తుత వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సాగు సన్నద్ధతపై చర్చించనున్నారు. సాగు, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడటం, వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఎదుర్కొనే ప్రత్యామ్నాయ ప్రణాళికలపై చర్చిస్తారు. ముఖ్యంగా ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం పరిశీలించనుంది.

కేంద్రం కొత్తగా తీసుకొస్తు్న్న VBG రాంజీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా అమలు చేయలేమని తెలంగాణ సర్కార్ ఇప్పటికే నిరసన గళం బలంగా వినిపిస్తోంది. పథకంలోని కొన్ని నిబంధనలను సవరించాలని డిమాండ్ చేస్తోంది. వీబీజీ రాంజీపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని, నాన్-బీజేపీ పాలిత రాష్ట్రాలతో కలిసి.. కేంద్రం మీద ఉమ్మడి పోరాటం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కేంద్రం తెచ్చిన వీబీజీ రాంజీ చట్టం అమలుతో రాష్ట్రం మీద పడే భారం, కూలీలకు జరిగే నష్టంపై కూలంకషంగా మంత్రివర్గంలో చర్చించి భవిష్యత్ ప్రణాళికలు ప్రకటిస్తారు. గ్రామాల్లో వసూలయ్యే డబ్బులు పంచాయతీ ఖాతాల్లోనే జమ చేసి.. గ్రామాలే ఖర్చు చేసుకునే విధంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

విద్యా రంగం, వైద్య రంగం, ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఫీజుల చెల్లింపుల్లో పారదర్శకత కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని కోసం ప్రత్యేక జీవో తెచ్చింది. అయితే జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. లీగల్ అడ్డంకులను ఎలా అధిగమించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. విద్యార్థులకు నష్టం జరగకుండా కొత్త పాలసీని ఖరారు చేయనున్నారు.

మరోవైపు.. రాష్ట్రంలో వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా సర్కార్ సిద్ధమైంది. మెడికల్ కాలేజీల్లో దాదాపు 60 శాతం వరకు ఉన్న అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు.. వైద్య అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్ల నుంచి ఏకంగా 70 ఏళ్లకు పెంచాలని సర్కార్ యోచిస్తోంది. కేబినెట్ భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీజీ సీట్లకు జాతీయ స్థాయిలో అనుమతులు లభించాలంటే అధ్యాపకుల సంఖ్య కీలకం కావడం వల్లనే ప్రభుత్వం ఈ వయోపరిమితి పెంపునకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీల విషయంలో కూడా క్లారిటీ రానుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చేందుకు పలు శాఖల ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అలా సిద్ధంగా ఉన్న 891 మంది ఉద్యోగుల భవితవ్యం తేలనుంది. వీరంతా తమకు తెలంగాణ స్థానికత ఉందని వాదిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎస్ నుంచి తెలంగాణ సీఎస్‌కు దీనిపై అధికారిక లేఖ కూడా అందింది. దీనిపై కూడా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు... వైద్య రంగం నుంచి గ్రామీణాభివృద్ధి వరకు... రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ విధానాలను నిర్దేశించే కీలక నిర్ణయాలకు కేబినెట్ సమావేశం వేదిక కానుంది. మొత్తంగా డిజిటల్ స్క్రీన్లపై సాగబోయే ఈ తొలి ఈ-క్యాబినెట్.. అటు పరిపాలనలో డిజిటల్ విప్లవానికి, ఇటు తెలంగాణ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారబోతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu