Cheryala: చేర్యాల ప్రధాన రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా లారీల పార్కింగ్!
చేర్యాల: చేర్యాల పట్టణం నుంచి జనగామ వెళ్లే ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా లారీల పార్కింగ్ కొనసాగుతోంది.
పట్టణంలోని నటరాజ్ రైస్ మిల్ ప్రాంతంలో ఇసుక వ్యాపారులకు సంబంధించిన లారీలను రోడ్డుకు ఇరువైపులా రోజుల తరబడి నిలిపివేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధాన రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా లారీలను పార్కింగ్ చేయడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల కారణంగా రోడ్డుపై నిలిపి ఉంచిన లారీలు సరిగా కనిపించక పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి ఇరువైపులా అక్రమంగా లారీలను పార్కింగ్ చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు, రహదారిపై లారీలు నిలపకుండా కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

