Credit Card
Credit Card: క్రెడిట్ కార్డు ఉన్న దాదాపు ప్రతీ ఒక్కరూ ఉపయోగిస్తుంటారు. కానీ కొందరు మాత్రం కార్డులను ఉపయోగించకుండా పక్కన పెడుతుంటారు.
అయితే చాలా కాలం పాటు కార్డులను ఉపయోగించకపోతే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.?
ఎక్కువకాలం వాడకపోతే కార్డు స్టేటస్ మారుతుందా?
క్రెడిట్ కార్డును నిరంతరం వాడకపోతే బ్యాంకులు దాన్ని ఇన్‌యాక్టివ్‌గా గుర్తించవచ్చు. ఒక ఏడాది వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్లు లేకపోతే, ముందుగా నోటీసు ఇచ్చి కార్డును పూర్తిగా క్లోజ్ చేసే అవకాశమూ ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు బ్యాంక్ మీకు సమాచారం ఇస్తుంది.
క్రెడిట్ స్కోర్‌పై ఎలా ప్రభావం పడుతుంది?
క్రెడిట్ కార్డు మీ క్రెడిట్ హిస్టరీలో ముఖ్యమైన భాగం. మీరు దీన్ని వాడకపోవడం లేదా అది క్లోజ్ కావడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ కాలం తగ్గుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను కొంతవరకు తగ్గించవచ్చు. ముఖ్యంగా పాత కార్డు అయితే దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
క్రెడిట్ లిమిట్, ఖర్చు నిష్పత్తి మార్పులు
మీ దగ్గర ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్‌లో ఒక కార్డు క్లోజ్ అయితే మొత్తం లిమిట్ తగ్గిపోతుంది. అప్పుడు మిగిలిన కార్డులపై చేసే ఖర్చు శాతం పెరుగుతుంది. దీనినే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటారు. ఇది ఎక్కువైతే మీ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
వాడకపోయినా చార్జీలు ఉండే అవకాశముంది
కార్డును ఉపయోగించకపోయినా, కొన్ని సందర్భాల్లో వార్షిక ఫీజులు లేదా మెయింటెనెన్స్ చార్జీలు వర్తించవచ్చు. వీటిని గమనించకుండా వదిలేస్తే పెనాల్టీలు పెరుగుతాయి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా ప్రభావితం చేయవచ్చు.
నిపుణుల సూచనలు ఏంటి?
క్రెడిట్ కార్డు యాక్టివ్‌గా ఉండాలంటే మధ్య మధ్యలో చిన్న మొత్తాల లావాదేవీలు చేయడం మంచిది. ఉదాహరణకు మొబైల్ రీఛార్జ్ లేదా సాధారణ కొనుగోళ్లు చేయడం ద్వారా కార్డు పనిచేస్తూనే ఉంటుంది. ఇక మీకు ఆ కార్డు అవసరం లేదని అనిపిస్తే, బ్యాంక్‌ను సంప్రదించి సరైన విధానంలో క్లోజ్ చేయడం ఉత్తమం. ఇలా చేస్తే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటుంది.

