Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Cuba Crisis: ఇరాన్‌ తరువాత క్యూబానే... సంక్షోభం దిశగా కమ్యునిస్ట్‌ దేశం

Cuba Crisis: ఇరాన్‌ తరువాత క్యూబానే... సంక్షోభం దిశగా కమ్యునిస్ట్‌ దేశం

hmtv 2 days ago

Cuba Crisis: ప్రపంచ రాజకీయ వేదికపై అమెరికా మరోసారి తన వ్యూహాత్మక పంజాని విప్పింది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో ఇరాన్‌ను ఒంటరిని చేసి, అక్కడి నాయకత్వాన్ని మార్చడంతో పాటు ఆ దేశ యూరేనియం నిల్వలపై పట్టు సాధించాలని చూస్తున్న వాషింగ్టన్..

ఇప్పుడు తన దృష్టిని క్యూబా వైపు మళ్లించింది. అమెరికా తీరానికి కేవలం 90 మైళ్లు అంటే 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న కమ్యూనిస్ట్ దేశంలో 'పాలనా మార్పు' కోసం డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిని తీసుకువస్తోంది. క్యూబా మాజీ అధ్యక్షుడు, 94 ఏళ్ల రాల్ క్యాస్ట్రోపై అమెరికా హత్యారోపణలు మోపడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. గత 66 ఏళ్లుగా సాగుతున్న క్యూబా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి చరమగీతం పాడటమే లక్ష్యంగా అమెరికా అడుగులు వేస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి శత్రుత్వం మళ్లీ రాజుకోవడంతో, రాబోయే రోజుల్లో క్యూబా భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే దానిపై అంతర్జాతీయ వేదికపై మూడు ముఖ్యమైన అంచనాలు వినిపిస్తున్నాయి.

రాల్ క్యాస్ట్రో అరెస్ట్ సాధ్యమేనా?

అమెరికా సైనిక బలగాలు నేరుగా క్యూబాలోకి ప్రవేశించి రాల్ క్యాస్ట్రోను బంధించి అమెరికన్ కోర్టులో నిలబెట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది అసాధ్యమేమీ కాదు, ఎందుకంటే గతంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విషయంలో, అలాగే 1989లో పనామా పాలకుడు మాన్యువల్ నోరియెగా విషయంలో అమెరికా ఇలాంటి మెరుపు దాడులే చేసింది. అయితే, క్యాస్ట్రో వయసు ప్రస్తుతం 94 ఏళ్లు కావడం, ఆయనకు క్యూబా సైన్యంలో ఉన్న అపారమైన రక్షణ దృష్ట్యా ఇది తీవ్రమైన అంతర్జాతీయ వివాదానికి దారితీయవచ్చు. ఒకవేళ అమెరికా ఇలా చేస్తే దాని ఫలితం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. క్యాస్ట్రో కుటుంబంపై ప్రపంచంలో చాలా దేశాలకు అభిమానం ఉంది. క్యాస్ట్రో కుటుంబాన్ని కూలదోయాలని చూస్తే ఆయా దేశాలన్ని క్యూబాకు మద్దతు పలికే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే...ఇప్పటికే తలనొప్పులు ఎదుర్కొంటున్న ట్రంప్‌ ప్రభుత్వం మరిన్ని తలనొప్పులు ఎదుర్కోవలసి వస్తుంది.

అంతర్గత నాయకత్వ మార్పు

అమెరికా క్యూబాను పూర్తిగా నాశనం చేయకుండా, వెనిజులా తరహాలోనే అక్కడి ప్రభుత్వంలో తమకు అనుకూలమైన కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని చూస్తోంది. మే 12న ట్రంప్ సోషల్ మీడియా వేదికగా "క్యూబా సహాయం కోరుతోంది, మేము మాట్లాడుతాం" అని ప్రకటించడం దీనికి బలం చేకూరుస్తోంది. సిఐఎ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ ఇప్పటికే రాల్ క్యాస్ట్రో మనవడు రాల్ గుల్లెర్మోతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రష్యా, చైనా నిఘా వర్గాలను క్యూబా నుంచి పంపించివేసి, అమెరికా పెట్టుబడులకు తలొగ్గేలా ఒప్పందం చేసుకోవాలనేది వాషింగ్టన్ వ్యూహం. అయితే, ప్రపంచంలో కమ్యునిస్ట్‌ దేశాలుగా ముద్రపడిన చైనా, రష్యాలు క్యూబాను వదిలేస్తాయా అన్నది సందేహమే. ఈ రెండు దేశాల అండ ఉన్నంతకాలం అమెరికా ఆ దేశంలోకి నేరుగా అడుగుపెట్టే దైర్యం చేయకపోవచ్చు.

ఆర్థిక పతనం - వలసల భయం

ప్రస్తుతం అమెరికా విధించిన వందలాది ఆంక్షల వల్ల క్యూబా తీవ్ర ఇంధన, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నిత్యం గంటల తరబడి పవర్ కట్, ప్రజలకు కనీసం 1,000 నుండి 1,500 క్యాలరీల ఆహారం కూడా దొరకని పరిస్థితి ఉంది. ఒకవేళ క్యూబా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కూలిపోతే, లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు రక్షించుకోవడానికి పడవల్లో అమెరికాలోని ఫ్లోరిడాకు లేదా మెక్సికోకు వలస వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అమెరికాకు కూడా కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. "మా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతాం కానీ అమెరికా ముందు తలవంచేది లేదు" అని క్యూబా స్పష్టం చేస్తోంది. ఇరాన్ తరహాలోనే క్యూబా నుంచి కూడా గట్టి ప్రతిఘటనే ఎదురవుతుండటంతో, ఈ ఆధిపత్య పోరు ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళనతో గమనిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu