Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Daily Horoscope: అష్టమి తిథి ధృవయోగంతో ఈ రాశులకు అదృష్టయోగం

Daily Horoscope: అష్టమి తిథి ధృవయోగంతో ఈ రాశులకు అదృష్టయోగం

hmtv 1 day ago

Daily Horoscope: శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అధిక జ్యేష్ట మాస శుక్ల పక్ష అష్టమి తిథి ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ రోజు మఘ నక్షత్ర ప్రభావం, ధృవ యోగం కలిసి కొన్ని రాశుల వారికి శుభప్రదమైన మార్పులు తీసుకురానున్నాయి.

మరికొన్ని రాశుల వారు మాటల్లో, నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గ్రహస్థితులు మనిషి ఆలోచనలు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ వాతావరణంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి రాశి వారు ఈ రోజు ఎలా గడపాలి? ఏ దేవతారాధన శ్రేయస్కరం? తెలుసుకుందాం.

మేషరాశి

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. చేపట్టిన పనులు ఆలస్యమైనా చివరకు పూర్తవుతాయి. ఉద్యోగ రంగంలో ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు మేలు చేస్తాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకపోవడం మంచిది. ఆదాయంతో పాటు ఖర్చులూ పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రావొచ్చు. ఈరోజు ఈరాశివారు ప్రత్యక్షదైవాన్ని ఆరాధించాలి.

వృషభరాశి

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. పిత్రార్జిత ఆస్తి విషయాల్లో శుభవార్తలు వినవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం లేదా దానధర్మాలు చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయాలి.

మిథునరాశి

మిథున రాశి వారు ఈ రోజు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనులను నిర్లక్ష్యం చేస్తే తరువాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆలస్యాలు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో వివాదాల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఎదురౌతాయి. ఈరోజు ఈరాశివారు నవగ్రహారాధన చేయాలి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగంలో కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు దత్తాత్రేయుడిని ఆరాధించాలి.

సింహరాశి

సింహ రాశి వారికి ఈ రోజు ఉత్సాహభరితంగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. మీరు చూపించే ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈరాశివారు కార్యసిద్ధి గణపతిని ఆరాధించాలి.

కన్యారాశి

కన్య రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా, సహనంతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. వ్యాపారులు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం కంటే ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మృదువుగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. ఈరోజు ఈరాశివారు పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించాలి.

తులారాశి

తులా రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఆలోచించిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించాలి.

వృశ్చికారాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మీ కృషికి ఫలితం దక్కుతుంది. ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈరాశివారు గాయత్రీదేవిని ఆరాధించాలి.

ధనస్సురాశి

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సహనం చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారి తీసే అవకాశం ఉంది. ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరిస్తే నష్టాలు తగ్గుతాయి. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయరాదు. ఈరోజు ఈరాశివారు దక్షిణామూర్తిని ఆరాధించాలి.

మకరరాశి

మకర రాశి వారికి ఈ రోజు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపడకండి. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో అపార్థాలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం శ్రేయస్కరం.

కుంభరాశి

కుంభ రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో అదృష్టం కలిసివస్తుంది. కొత్త అవకాశాలు, శుభవార్తలు మీ ఇంట ఆనందాన్ని నింపుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకునే రోజు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. ఈరోజు ఈరాశివారు కొల్హాపురి శ్రీమహాలక్ష్మిని ఆరాధించాలి.

మీనరాశి

మీన రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ మంచితనం, ధర్మబుద్ధి మీకు గౌరవాన్ని తెస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. స్వల్ప ప్రయత్నంతోనే మంచి ఫలితాలు అందుకుంటారు. పొదుపు పెంచాలనే ఆలోచన కలుగుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు పార్వతీదేవిని ఆరాధించాలి.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు సామాన్యమైనవే. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కావు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu