Deepfake
Giorgia Meloni: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలని డీప్‌ఫేక్ భూతం ఇప్పుడు ఏకంగా ఒక దేశ ప్రధానినే టార్గెట్ చేసింది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని తాను లోదుస్తుల్లో ఉన్నట్లుగా సృష్టించిన నకిలీ ఫొటోలపై తీవ్రంగా స్పందించారు.
ఇది కేవలం తనపై జరిగిన దాడి మాత్రమే కాదని, వ్యవస్థకే ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు.
అసలు ఏం జరిగిందంటే..?
సోషల్ మీడియాలో జార్జియా మెలోని మంచం మీద లోదుస్తుల్లో ఉన్నట్లు ఒక ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చూడ్డానికి అచ్చం అసలు ఫొటోలాగే ఉన్న ఆ ఫొటో ఏఐను ఉపయోగించి సృష్టించారు. దీనిపై మెలోని వెనక్కి తగ్గకుండా, ఆ నకిలీ చిత్రాన్ని స్వయంగా ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు.ఆమె తన పోస్ట్‌లో కొంత హాస్యాంతో,పాటు ఆ ఫొటో తయారు చేసిన వారికి చినపాటి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ రోజుల్లో ఏఐతో సృష్టించిన నా నకిలీ ఫొటోలు విపరీతంగా వైరల్ ఉన్నాయి.
వీటిని సృష్టించిన వారు నన్ను చాలా అందంగా చూపించారని ఒప్పుకోవాల్సిందే. కానీ, వాస్తవం ఏమిటంటే.. అబద్ధాలను సృష్టించడానికి ఈ రోజుల్లో దేన్నైనా వాడుతున్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ.. తనను తాను రక్షించుకునే శక్తి తనకు ఉందని, కానీ సామాన్య మహిళలు ఇలాంటి వేధింపులకు గురైతే వారి పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని నమ్మే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి అంటూ ఆమె ఒక కొత్త సూత్రాన్ని ప్రపంచానికి పిలుపునిచ్చారు.
మెలోని చేసిన ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి అశ్లీల ఫొటోలను సృష్టించిన వ్యక్తిని ఎందుకు రక్షిస్తున్నారు? అతని వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు? అని ప్రశ్నిస్తున్నారు.టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒక దేశ ప్రధానికే ఈ పరిస్థితి ఎదురైతే, సామాన్యుల భద్రత ఏమిటి అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మెలోని చెప్పినట్లుగా.. ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతిదీ నిజం కాదని ఈ ఘటన రుజువు చేసినట్టు అయింది.

