Dailyhunt
Donald Trump : భారత్-పాక్ యుద్ధంతో పాటు మరో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump : భారత్-పాక్ యుద్ధంతో పాటు మరో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

hmtv 2 weeks ago

Donald Trump

Donald Trump

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్‌లో జరిగిన తాజా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ..

ప్రపంచంలోనే తాను అతిపెద్ద శాంతిదూత తనేనని ప్రకటించుకున్నారు. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని, తన వల్లే కోట్ల మంది ప్రాణాలు నిలిచాయని చెప్పడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఇరాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ట్రంప్ పాత విషయాలను మళ్ళీ తెరపైకి తీసుకువచ్చారు.

భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ ఏమన్నారంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన గొప్పలను చెప్పుకుంటూ భారత్, పాకిస్థాన్ ప్రస్తావన తెచ్చారు. గతంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు తానే మధ్యవర్తిత్వం వహించానని ఆయన చెప్పుకొచ్చారు. "రెండు అణు దేశాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి, అప్పటికే 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఆ సమయంలో నేను జోక్యం చేసుకోకపోతే 3 నుంచి 5 కోట్ల మంది ప్రాణాలు పోయేవి. పాకిస్థాన్ ప్రధాన మంత్రే స్వయంగా నాతో ఈ మాట చెప్పారు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కేవలం తన మాటతోనే ఆ యుద్ధం ఆగిపోయిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు మొత్తం 8 యుద్ధాలను పరిష్కరించానని తెలిపారు. ప్రతి కేసులోనూ ఆయా దేశాల నేతలు తనకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖలు రాశారని, తన పేరును నోబెల్ శాంతి బహుమతి కమిటీకి కూడా పంపారని ఆయన వెల్లడించారు. ఒకవేళ ఇరాన్, లెబనాన్ విషయాలను కూడా కలిపితే తాను మొత్తం 10 యుద్ధాలను ఆపినట్టు అవుతుందని ట్రంప్ తనను తాను ప్రపంచ శాంతిదూతగా ప్రకటించుకున్నారు.

ఇరాన్ పై విమర్శల వర్షం

ఇరాన్ వ్యవహారంపై కూడా ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇరాన్ పాలకులు 42 వేల మందిని చంపేశారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం తాను ఇరాన్‌ను ఏదో ఒక విధంగా కాపాడాలని చూస్తున్నానని, కానీ అక్కడి పాలన క్రూరంగా ఉందని విమర్శించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తాము పూర్తిగా దెబ్బతీశామని, వారు అమెరికా ముందు ఎంతకాలం నిలబడతారో చూస్తామని ఆయన సవాల్ విసిరారు. ఇరాన్ విదేశీ విధానంపై తాము కఠినంగా వ్యవహరిస్తున్నట్టు ట్రంప్ స్పష్టం చేశారు.

టారిఫ్‌లతో యుద్ధాలకు చెక్

యుద్ధాలను ఎలా ఆపుతున్నారనే ప్రశ్నకు ట్రంప్ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. దేశాల మధ్య గొడవలు జరిగినప్పుడు తాను టారిఫ్ ఆయుధాన్ని ఉపయోగిస్తానని చెప్పారు. "మీరు యుద్ధం చేస్తే మీ దేశంపై భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరిస్తాను, అప్పుడు గొడవలు ఆగిపోతాయి" అని ఆయన చెప్పుకొచ్చారు. భారత్-పాక్ విషయంలో కూడా తాను ఇలాగే వ్యవహరించానని, ఆ ఆర్థిక హెచ్చరికల వల్లే రెండు దేశాలు వెనక్కి తగ్గాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu