Dornala: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండల పరిధిలో శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిలో రహదారి ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
సుమారు 20 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డుకు ఇరువైపులా కొందరు ఆక్రమణదారులు మెట్లు నిర్మించుకోవడంతో రహదారి మరింత ఇరుకుగా మారింది.
అదేవిధంగా రహదారి మధ్యలో కార్లు పార్క్ చేయడం, విద్యుత్ తీగలు రోడ్డుకు అడ్డంగా వేలాడుతూ ఉండటం వల్ల వాహనదారులు, పాదాచారులు ప్రమాద భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ లేదా అగ్నిమాపక వాహనాలు లోపలికి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో మురుగు నీరు రోడ్డుపైకి చేరి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామ ప్రజలు తెలిపారు. సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి రహదారి ఆక్రమణలను తొలగించడం, రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలను నియంత్రించడం, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

