Fire Accident: ఘోర ప్రమాదం.. ఆస్పత్రి ఐసీయూలో చెలరేగిన మంటలు, 10 మంది రోగులు మృతి!
Fire Accident: బిహార్ రాష్ట్రంలో అత్యంత హృదయవిదారకమైన ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.
ముజఫర్‌పూర్‌లోని ప్రముఖ ప్రసాద్ ఆస్పత్రిలో గురువారం తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక, సహాయక సిబ్బంది సకాలంలో స్పందించి మరో 10 మందిని ప్రాణాలతో కాపాడారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాద్ ఆస్పత్రి భవనంలోని ఐదో అంతస్తులో ఉన్న అత్యవసర విభాగానికి (ICU) మంటలు వేగంగా వ్యాపించాయి. ఐసీయూలో వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలపై ఉన్న రోగులు కదలలేని స్థితిలో ఉండటంతో.. దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకుని ఊపిరాడక, కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆస్పత్రి ఐసీయూ విభాగంలో ఒక్కసారిగా విద్యుత్ వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు అంటుకోగానే ఆస్పత్రి అంతటా క్షణాల్లో పొగ అలుముకోవడంతో రోగులు, వారి బంధువులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ముజఫర్‌పూర్ జిల్లా కలెక్టర్ సుబ్రత్ కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని, ఆస్పత్రిలో అగ్నిమాపక రక్షణ నిబంధనలు (Fire Safety Norms) పాటించారా లేదా అనే కోణంలోనూ విచారణ జరుపుతామని కలెక్టర్ వెల్లడించారు. ఈ ఘటనతో ముజఫర్‌పూర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

