Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Fuel crisis: పెట్రోల్, డీజిల్ మరింత బాదుడు

Fuel crisis: పెట్రోల్, డీజిల్ మరింత బాదుడు

hmtv 1 week ago

Fuel crisis: పెట్రోల్, డీజిల్ మరింత బాదుడు

Fuel crisis: దేశంలో వాహనదారులకు మళ్లీ చమురు సెగ తగులుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మారుతున్న సమీకరణాలు, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం వెరసి దేశంలో ఇంధన సంక్షోభానికి దారితీస్తున్నాయి.

శుక్రవారం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 చొప్పున పెరిగినప్పటికీ, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ధరలు మరింత ప్రియం కావడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 106 నుండి 110 డాలర్ల మార్కుకు చేరాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ నిరంతరం క్షీణించడం భారత చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ముడి చమురు సరఫరా మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.

రోజుకు రూ.500 నుండి రూ.1,000 కోట్ల నష్టం

ప్రస్తుతం పెరిగిన రూ.3 ధరతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల నష్టాల్లో కేవలం 10 శాతం మాత్రమే రికవరీ అయింది. ఇంటర్నేషనల్ ప్రైసింగ్‌తో పోలిస్తే మన దేశంలో కంపెనీలు ఇప్పటికీ భారీ నష్టాలను భరిస్తున్నాయి. పెట్రోల్‌పై నష్టం లీటరుకు రూ.11 నుండి రూ.20 వరకు ఉంది. డీజిల్‌పై నష్టం లీటరుకు రూ.30 నుండి రూ.39 వరకు భరిస్తున్నాయి. దీనివల్ల చమురు కంపెనీలకు రోజుకు రూ.500 కోట్ల నుండి రూ.1,000 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుత ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఈ మొత్తం నష్టాలు రూ.1 లక్ష కోట్లు దాటే ప్రమాదం ఉందని, ఇది చమురు సంస్థల గత ఏడాది లాభాలను సైతం తుడిచిపెట్టేలా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరో రూ.20 నుండి రూ.30 పెరిగే అవకాశం?

చమురు సంస్థలు ఈ భారీ నష్టాల ఊబి నుంచి బయటపడాలంటే ఇంధన ధరలను మరో 20% నుండి 30% (అంటే లీటరుకు రూ.20 నుండి రూ.30 వరకు) పెంచడం అనివార్యంగా కనిపిస్తోంది. అయితే, ఇంత పెద్ద మొత్తంలో భారాన్ని ఒకేసారి సామాన్యుడిపై మోపకుండా, క్రమక్రమంగా ధరలను సవరిస్తామని కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్ సింగ్ సంకేతాలిచ్చారు. ప్రజలపై ఒకేసారి భారం పడకుండా చూస్తాం. కానీ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా క్రమంగా ధరల సర్దుబాటు తప్పకపోవచ్చు అని కేంద్ర పెట్రోలియం శాఖ ఇప్పటికే ప్రకటించింది.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదు. ముఖ్యంగా డీజిల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయి. దీనివల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, పాలు వంటి ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరిగి, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా తలకిందులు కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu