Dailyhunt
Gas Cylinder Theft: పోలీస్‌ స్టేషన్లో విచిత్రమైన కేసు- సిలిండర్లు ఎత్తుకెళ్లారు...కనిపెట్టండిసారు

Gas Cylinder Theft: పోలీస్‌ స్టేషన్లో విచిత్రమైన కేసు- సిలిండర్లు ఎత్తుకెళ్లారు...కనిపెట్టండిసారు

hmtv 1 week ago

Gas Cylinder Theft: పోలీస్‌ స్టేషన్లో విచిత్రమైన కేసు- సిలిండర్లు ఎత్తుకెళ్లారు...కనిపెట్టండిసారు

Gas Cylinder Theft: నాన్నకు ప్రేమతో సినిమాలోని ఓ డైలాగ్‌ మనందరికీ గుర్తుండే ఉంటుంది.

అది ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం సమయంలో సరిగ్గా సరిపోతుంది. ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే... దాని ప్రభావం మనింటి వంట గదులపై ప్రభావం చూపుతోంది. యుద్ధ ప్రభావంతో గ్యాస్‌ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురౌతున్నాయి. ఒకప్పుడు సిలిండర్‌ బుక్‌చేస్తే మూడు నాలుగు రోజుల్లో వచ్చేసేది. కానీ, ఇప్పుడు సిలిండర్‌ డెలివరీ కోసం రెండు వారాల సమయం పడుతోంది. ఇక ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు బ్లాక్‌ మార్కెట్‌ వ్యాపారులు.

హుస్నాబాద్‌లో విచిత్ర సంఘటన

ఇలాంటి పరిస్థితుల్లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి ఆవరణలో ఉంచిన రెండు గ్యాస్‌ సిలిండర్లను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు వేణుగోపాల్‌ రెడ్డి పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కాడు. దొంగిలించిన గ్యాస్‌ సిలిండర్లను వెతికిపెట్టమని ఫిర్యాదు చేశాడు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..గత 25 ఏళ్లుగా ఇంటి బయట గ్యాస్‌ సిలిండర్లను ఉంచి పైప్‌ ద్వారా వంటగదికి కనెక్షన్‌ ఇచ్చుకొని వినియోగించుకుంటున్నాడు. ఇంతకాలం ఎలాంటి సమస్య రాలేదని, కానీ, ఇటీవల గ్యాస్‌ కొరత కారణంగా ఈ దొంగతనం జరిగిందని అనుమానం వ్యక్తం చేశాడు. విచిత్రమైన కేసు పోలీస్‌ స్టేషన్‌కు రావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

గ్యాస్‌కోసం తంటాలు

మరోవైపు జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లోనూ గ్యాస్‌ కొరత మరింత తీవ్రంగా మారింది. వంటగ్యాస్‌ కోసం ప్రజలు ఉదయం నుంచే ఖాళీ సిలిండర్లతో క్యూలో నిలబడుతున్నారు. కొందరైతే 15 రోజుల క్రితం గ్యాస్‌ బుక్‌ చేసినా సిలిండర్‌ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరి పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. తమ పేర్లతో బుక్‌ చేసిన సిలిండర్లను ఇతరులకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే గ్యాస్‌ కొరత కారణంగా కొత్త కొత్త సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. బ్లాక్‌ మార్కెట్‌పై చర్యలు తీసుకొని సరఫరాలను సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu