Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gaza Peace: ట్రంప్‌కు నెతన్యాహు షాక్‌... గాజాపై భిన్నాభిప్రాయాలు

Gaza Peace: ట్రంప్‌కు నెతన్యాహు షాక్‌... గాజాపై భిన్నాభిప్రాయాలు

hmtv 1 week ago

Gaza Peace: గాజా శాంతి ఒప్పందంపై బహిరంగంగా వెల్లడైన విభేదాలు... అమెరికా అధ్యక్షుడితో నెతన్యాహు విభేధించాడా? హమాస్‌ ఆయుధాలు వీడే వరకు శాంతి కుదరదని తెగేసి చెప్పిన నెతన్యాహు...

అమెరికా... ఇజ్రాయిల్‌ మధ్య దూరం పెరుగుతుందా?

పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజా ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని 'బోర్డ్ ఆఫ్ పీస్' రూపొందించిన ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతవారం అమెరికా-హమాస్ మధ్య కుదిరిన ఈ శాంతి ఒప్పందంలోని పలు అంశాలపై తనకు, అధ్యక్షుడు ట్రంప్‌కు మధ్య స్పష్టమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయని నెతన్యాహు బహిరంగంగానే ప్రకటన చేశారు. ఈ పరిణామంతో అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.

విభేదాలకు ప్రధాన కారణం ఏమిటి?

బోర్డ్ ఆఫ్ పీస్ ప్రత్యేక రాయబారి నికోలే మ్లాడెనోవ్‌తో కీలక సమావేశం నిర్వహించిన అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడారు. హమాస్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై తమకున్న అభ్యంతరాలను ఆయన స్పష్టంగా వివరించారు. గాజా పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కావాలన్నా లేదా ఇజ్రాయెల్ సైన్యం అక్కడ నుంచి వెనక్కి తగ్గాలన్నా... ముందుగా హమాస్ తన వద్ద ఉన్న ఆయుధాలన్నింటినీ పూర్తిగా త్యజించాలని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజా స్ట్రిప్‌ను పూర్తిగా ముఠాల రహిత, ఆయుధ రహిత ప్రాంతంగా మార్చిన తర్వాతే తదుపరి అడుగులు ఉంటాయని తేల్చిచెప్పారు.

ఒప్పందంలో ఏముంది? ఇప్పుడు ఏమవుతోంది?

గతవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ... హమాస్ ఆయుధాలు వదిలేసేందుకు, ఇజ్రాయెల్ దళాలు గాజా నుంచి ఉపసంహరించుకునేందుకు చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. గాజా శాంతి ఒప్పందాన్ని చారిత్రాత్మక ఒప్పందాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అయితే, ప్రారంభ ముసాయిదా ప్రకారం... ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ, హమాస్ నిరాయుధీకరణ రెండు కూడా విడతల వారీగా సమాంతరంగా జరగాల్సి ఉంది. అయితే, ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవ్వడంతో బోర్డ్ ఆఫ్ పీస్ తన వైఖరిని సవరించుకోవాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ బలగాలు గాజా సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లడానికి ముందే హమాస్ సంపూర్ణంగా ఆయుధాలను వీడాలని బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతినిధులు తాజాగా వెల్లడించారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు మిత్రదేశమైన ఇజ్రాయెలే మెలిక పెట్టడంతో, గాజాలో శాంతి ఎప్పుడు పునరుద్ధరణకు నోచుకుంటుందోనని ప్రపంచ దేశాలు ఆందోళనతో గమనిస్తున్నాయి. హమాస్‌ పూర్తిగా ఆయుధాలను విడిచేవరకు ఇజ్రాయిల్‌ సైన్యం వెనక్కి వెళ్లదు. సైన్యం వెనక్కి వెళ్లకుంటే గాజాలో శాంతి నెలకొనదు. శాంతి లేకుంటే పునఃర్నిర్మాణం జరగదు. మొత్తానికి గాజా భవితవ్యం నిరాయుధీకరణ, సైన్యం వెనక్కి వెళ్లడంపైనే ఆధారపడి ఉంటుంది అనడంలో సందేహం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu