Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Happy Birthday Prabhas: ఇండియన్ బాక్సాఫీస్‌కు ఏకైక రారాజు

Happy Birthday Prabhas: ఇండియన్ బాక్సాఫీస్‌కు ఏకైక రారాజు

hmtv 42 mins ago

Happy Birthday Prabhas: ఇండియన్ బాక్సాఫీస్‌కు ఏకైక రారాజు

Happy Birthday Prabhas: భారతీయ సినీ పరిశ్రమ చరిత్రలో ఎందరో అగ్ర నటులు ఓ వెలుగు వెలిగి బాక్సాఫీస్ వద్ద తమదైన ముద్ర వేశారు.

కానీ టాలీవుడ్ పునాదుల నుంచి మొదలై, ప్రపంచ సినీ యవనికపై భారతీయ సినిమా సత్తాను చాటిచెప్పిన కథానాయకుడు మాత్రం ప్రభాస్ ఒక్కడే. స్థానిక భాషా హద్దులను తుడిచిపెట్టేసి 'పాన్ ఇండియా' అనే విస్తృత మార్కెట్‌కు సరికొత్త నిర్వచనం చెప్పిన ఘనత ఆయనది. దాదాపు రెండున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో ఓ సాధారణ యువకుడి నుంచి అగ్రశ్రేణి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ శైలి, స్థాయి రెండూ అనన్యసామాన్యం.

'ఈశ్వర్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన రోజుల్లోనే తన కటౌట్, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు ప్రభాస్. 'వర్షం'తో రొమాంటిక్ హీరోగా, 'ఛత్రపతి'తో తిరుగులేని మాస్ కథానాయకుడిగా బాక్సాఫీస్ వద్ద విజృంభించారు. కేవలం యాక్షన్ చిత్రాలకే పరిమితం కాకుండా 'చక్రం' వంటి భావోద్వేగ భరిత కథలతో పాటు 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకు అత్యంత చేరువయ్యారు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ 'బాహుబలి'తో భారతీయ చిత్ర పరిశ్రమ సరిహద్దులే చెదిరిపోయాయి. దేశవ్యాప్తంగానే కాక, జపాన్, అమెరికా వంటి అంతర్జాతీయ దేశాల్లోనూ ప్రభాస్ పేరు మారుమోగిపోయింది.

వెండితెరపై కొండలను పిండిచేసే భారీ కటౌట్‌గా కనిపించే ప్రభాస్, నిజ జీవితంలో మాత్రం ఒదిగి ఉండే వినయశీలి. ఎంతటి గ్లోబల్ ఖ్యాతి దక్కినా స్వచ్ఛమైన నవ్వు, ఎదుటివారిని 'డార్లింగ్' అంటూ ఆప్యాయంగా పలకరించే తీరు ఆయనను ఇండస్ట్రీలో అందరికీ ఆప్తుడిగా మార్చాయి. ప్రభాస్ విందు మర్యాదల గురించి చిత్ర పరిశ్రమలో వినని చూడని వారుండరు. సెట్స్‌లో ఉండే ప్రతి ఒక్కరికీ ప్రేమతో కడుపునిండా భోజనం వడ్డించే ఆయన మంచి మనసు గురించి తోటి నటీనటులు ఎప్పుడూ ఆత్మీయంగా ముచ్చటించుకుంటారు. అభిమానులను తన జీవితంలో భాగస్వాములుగా చూస్తూ వారి ఎదుగుదలను ఆకాంక్షించే అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం.

ఫలితాలతో సంబంధం లేకుండా పరిశ్రమకు ఎప్పుడూ కమర్షియల్‌గా ఊపునిచ్చే అతికొద్ది మంది హీరోల్లో ప్రభాస్ ముందంజలో ఉన్నారు. ప్రేక్షకులకు నిరంతరం వినోదం పంచాలనే సంకల్పంతో ఏడాదికి కనీసం రెండు చిత్రాలైనా తీసుకురావాలని వేగంగా అడుగులు వేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మైండ్ బ్లోయింగ్ లైనప్‌ను ఓసారి గమనిస్తే...

ఫౌజీ : హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పీరియాడిక్ వార్ డ్రామా.

స్పిరిట్ : సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న హై-వోల్టేజ్ పోలీస్ కథ.

కల్కి 2898 ఏడీ సీక్వెల్: ప్రపంచ స్థాయి విజయం సాధించిన 'కల్కి' కథా విస్తరణ.

సలార్ 2 : ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్.

ఒకవైపు అభిమానులు ఆయన కొత్త చిత్రాల అప్‌డేట్ల కోసం, మరోవైపు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్త కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ సరిహద్దులను చెరిపేస్తూ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ అగ్రపీఠంపై కూర్చున్న మన రెబెల్ స్టార్ ప్రభాస్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మున్ముందు మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి భారతీయ సినిమా ఖ్యాతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu