Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Heavy Rains : వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్

Heavy Rains : వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్

hmtv 47 mins ago

Heavy-Rains

Heavy Rains : వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న జడివానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

నిన్నమొన్నటి వరకు వర్షాభావంతో కళావిహీనంగా మారిన చెరువులు, జలాశయాలు నేడు జలసిరులతో తొణికిసలాడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ-మహారాష్ట్ర బంధం కట్..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఆదిలాబాద్ సమీపంలోని పెన్‌గంగా నది మహోగ్రరూపం దాల్చడంతో జైనథ్ మండలం ఆనంద్ పూర్ వద్ద వరద నీరు బ్రిడ్జి పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ , మహారాష్ట్ర సరిహద్దుల మధ్య వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఏజెన్సీ మండలాలైన ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి పరిధిలో వంకతుమ్మ, నర్సాపూర్, శాంతాపూర్, మత్తడి గూడ సహా దాదాపు 16 గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి.

కూలిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి నిర్మల్ జిల్లాలో జనజీవనం తీవ్రంగా స్తంభించింది. ముథోల్ నియోజకవర్గంలో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భైంసా మండలం మహాగం-గుండెగాం గ్రామాల మధ్య భారీ వృక్షం కూలిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోగా, కుబీర్ మండలం పార్డి(బి) మార్గంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. కుంటాల మండలంలోని కల్లూరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొత్త వెంకూర్, పాత వెంకూర్, లింబ(బి), ఓలా గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఆకట్టుకుంటున్న బ్రహ్మేశ్వర జలపాతం.. ప్రమాదంలో గడ్డెన్నవాగు

ఒకవైపు వర్షాల భయం ఉన్నప్పటికీ, కుబీర్ మండలంలోని బ్రహ్మేశ్వర జలపాతం సరికొత్త రూపుదాల్చి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పచ్చని కొండల నడుమ ప్రవహిస్తున్న జలసిరులను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పర్యాటకులు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఎగువన మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో గడ్డెన్నవాగు ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు ప్రాజెక్ట్ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో మంత్రి వివేక్, కలెక్టర్ పర్యటన

భారీ వర్షాల దాటికి దెబ్బతిన్న ప్రాంతాలను కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పరిశీలించారు. మందమర్రి, క్యాతననపల్లి, చెన్నూర్ పట్టణాల్లో వర్షంలోనే పర్యటించి, ఇళ్లు కూలిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్న మంత్రి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

గండి కొట్టిన అధికారులు, పునరావాస కేంద్రాలు

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నాగారంలో రోడ్డు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోగా, దోనూరు, తీగలధర్మారంలో పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బుగ్గారం పెద్ద చెరువులోకి భారీగా నీరు చేరుతుండటంతో కట్ట తెగే ప్రమాదం ఉందని భావించిన అధికారులు, ముందస్తు జాగ్రత్తగా గండి కొట్టి నీటిని కిందకు విడుదల చేశారు. మెట్‌పల్లి పురపాలక సంఘం పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని మోటార్ల ద్వారా తోడివేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి, బాధితుల కోసం పాత మున్సిపల్ కార్యాలయంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu