Hyderabad: డయల్ 100 అలర్ట్.. హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నం భగ్నం
Hyderabad: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు యత్నించిన ఒక వ్యక్తిని ఓయూ సిటీ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, చాకచక్యంగా ప్రాణాలతో కాపాడారు.
డయల్ 100 ద్వారా అందిన సమాచారంతో నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
ఈ నెల 17.05.2026 రాత్రి సుమారు 21:00 గంటల సమయంలో బోరబండ వద్ద ఉన్న నెలవేణి అనే మహిళ నుండి డయల్ 100కు ఒక అత్యవసర పిలుపు వచ్చింది. తన భర్త మల్లేష్ తమ నివాసంలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆవేదనతో సమాచారం అందించారు. ప్రాథమిక విచారణలో సదరు వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల (Financial Issues) కారణంగానే ఈ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని వెంటనే ఓయూ పీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎమ్. మహేష్ గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సమర్థవంతమైన మార్గదర్శకత్వం మరియు సాంకేతిక సహాయంతో బాధితుడు మల్లేష్ ఉన్న ఖచ్చితమైన నివాస స్థానాన్ని (ఎమ్.కె నగర్, స్ట్రీట్ నంబర్ 7 సమీపంలో) గుర్తించారు.
సమాచారం అందిన వెంటనే బ్లూ కోల్ట్-3 (BC-3) సిబ్బంది అయిన పోలీస్ కానిస్టేబుల్ (PC 5584) సి. విజయ్ కుమార్ నాయక్ మరియు టీజీఎస్పీ కానిస్టేబుల్ (PC 1699) తిరుపతి అత్యంత వేగంగా ఎమ్.కె నగర్‌లోని సదరు నివాసానికి చేరుకున్నారు. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించే సమయానికి మల్లేష్ ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడు. కానిస్టేబుళ్లు ఇద్దరూ అత్యంత సమయస్ఫూర్తితో, క్షణాల వ్యవధిలో అతనిని అడ్డుకుని, ఉరితాటి నుండి సురక్షితంగా కిందకు దించి ప్రాణాలు కాపాడారు.
కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగింత: అనంతరం సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓయూ ఇన్స్పెక్టర్ శ్రీ ఎమ్. మహేష్ గారు స్వయంగా అతనికి మానసిక ధైర్యాన్ని ఇస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం అతనిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆపదలో ఉన్న సమాచారం అందిన వెంటనే స్పందించి, ఒకరి ప్రాణాన్ని కాపాడిన పోలీస్ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు మరియు స్థానిక ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు.

