Hyderabad: రైతు వాకిట మహాలక్ష్మి.. ఇబ్రహీంపట్నం, భువనగిరి రైతులకు గోవుల పంపిణీ!
Hyderabad: గోవు గోశాలలో బందీగా ఉండకూడదని, ప్రతి రైతు వాకిట మహాలక్ష్మిలా ఉండాలన్నదే యుగ తులసి ఫౌండేషన్ సంకల్పమని ఫౌండేషన్ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్ అన్నారు.
గోసంరక్షణతో పాటు, ప్రాచీన గోధారిత వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించడమే లక్ష్యంగా యుగ తులసి గోమాక్షేత్రం నుండి రైతులకు నిరంతరాయంగా గోవులను, నందులను (ఎద్దులను) ఉచితంగా అందజేస్తున్నామని ఆయన తెలిపారు.
తాజాగా, వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు రైతులకు గోవులను పంపిణీ చేశారు. ఆ వివరాలు:
నందనం భువనగిరి మండలం, యాదాద్రి జిల్లా రైతు సోదరులు శివప్రసాద్, హరిప్రసాద్‌లకు ఒక ఆవు, ఒక నందిని అందజేశారు. ఏనుగుల గూడెం ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా రైతులు నరసింహ, శేఖర్‌లకు రెండు నందులు, ఒక ఆవును పంపిణీ చేశారు. అన్నాజ్ పూర్ రామోజీ ఫిలిం సిటీ సమీపంలో రైతు వెంకటేష్‌కు వ్యవసాయం నిమిత్తం ఆవులను అందజేశారు.
ఈ సందర్భంగా కొలిశెట్టి శివకుమార్ "ఎద్దులతో నాగలి పట్టి దుక్కి దున్నడం ద్వారానే భూమి తల్లి చల్లగా ఉంటుంది, విషరహిత ఆహారం లభిస్తుంది. రైతులు గోవులను తమ సొంత బిడ్డల్లా సాదుకోవాలి. అయితే, ఫౌండేషన్ నుండి పొందిన గోవులను ఎవరైనా స్వార్థం కోసం సంతల్లో అమ్మినట్లు తెలిస్తే, వారిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గోవును అమ్మడం అంటే మన సంస్కృతిని అమ్మడమే" అని హెచ్చరించారు. గోధారిత వ్యవసాయం చేసే ప్రతి రైతుకు యుగ తులసి ఫౌండేషన్ అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

