Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్ యుద్ధంతో మన జీవితాల్లో వచ్చిన మార్పులివే.. ఏయే ధరలు పెరిగాయంటే.?

ఇరాన్ యుద్ధంతో మన జీవితాల్లో వచ్చిన మార్పులివే.. ఏయే ధరలు పెరిగాయంటే.?

hmtv 1 week ago

రాన్ యుద్ధంతో మన జీవితాల్లో వచ్చిన మార్పులివే.. ఏయే ధరలు పెరిగాయంటే.?

Iran War: ఇరాన్ యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం ఇప్పుడు భారత మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది.

పెట్రోల్, డీజిల్, గ్యాస్, పాలు, సిఎన్‌జీ మాత్రమే కాదు.. రెస్టారెంట్‌లో భోజనం ఖర్చు కూడా పెరిగింది. సాధారణ ప్రజలపై జీవన వ్యయం మరింత భారంగా మారుతోంది.

పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగసిపడుతున్నాయి. దీని ప్రభావంతో భారత్‌లో కూడా ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3.14, డీజిల్‌పై రూ.3.11 పెంపు జరిగింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత భారత్‌లో పెట్రోల్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం అన్ని వస్తువుల ధరలపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పాల ధరలు కూడా పెంచిన సంస్థలు

దేశంలోని ప్రముఖ డెయిరీ సంస్థలు కూడా పాల ధరలను పెంచాయి. అమూల్, మదర్ డెయిరీ, సాంచి వంటి కంపెనీలు లీటర్ పాలపై రూ.2 వరకు ధర పెంచాయి. టోన్డ్ మిల్క్ ధర రూ.58 నుంచి రూ.60కి పెరిగింది. డబుల్ టోన్డ్ పాలు రూ.54కు చేరాయి. గేదె పాలు లీటర్ ధర రూ.60 నుంచి రూ.62కు పెరిగింది. ఈ కొత్త ధరలు మే 14 నుంచి అమల్లోకి వచ్చాయి.

LPG, CNG ధరలూ సామాన్యులకు షాక్

మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా గ్యాస్ ధరలపై కూడా ప్రభావం పడింది. ముఖ్యంగా కమర్షియల్ LPG సిలిండర్ల ధరలు వరుసగా పెరుగుతున్నాయి. మార్చి నుంచి మే వరకు కమర్షియల్ గ్యాస్ ధరలు దశలవారీగా పెరిగి, మే 1న ఒక్కసారిగా భారీ పెంపు నమోదైంది. గృహ వినియోగ LPG సిలిండర్ ధర కూడా సుమారు రూ.60 వరకు పెరిగింది.

అలాగే CNG ధరలు కూడా అనేక నగరాల్లో కిలోకు రూ.2 నుంచి రూ.4.50 వరకు పెరిగాయి. గ్లోబల్ గ్యాస్ సరఫరా సమస్యలు, హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

విమాన ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం

జెట్ ఇంధన ధరల్లో కూడా భారీ పెరుగుదల నమోదైంది. ఫిబ్రవరి చివర్లో బ్యారెల్‌కు 99.40 డాలర్లుగా ఉన్న జెట్ ఫ్యూయల్ ధర, మే నాటికి 162.89 డాలర్లకు చేరింది. దీంతో విమానయాన సంస్థల ఖర్చులు పెరిగి, భవిష్యత్తులో విమాన టికెట్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

రెస్టారెంట్లు, హోటళ్లలో భోజనం ఖరీదు

కమర్షియల్ గ్యాస్ ధరలు, రవాణా వ్యయాలు పెరగడంతో రెస్టారెంట్లు, హోటళ్లలో భోజన ధరలు కూడా పెరిగాయి.

కొన్ని నగరాల్లో ఆహార పదార్థాల ధరలు 10% నుంచి 30% వరకు పెరిగినట్లు సమాచారం. దీంతో బయట తినే ఖర్చు సామాన్యులకు మరింత భారమవుతోంది.

దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల

ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం దేశ ద్రవ్యోల్బణంపైనా పడింది. ఏప్రిల్ నెలలో హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ రేటు 8.3%కు చేరింది. ఇది గత 42 నెలల్లో అత్యధిక స్థాయిగా చెబుతున్నారు. మార్చిలో ఈ రేటు 3.88% ఉండగా, ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఒక్కసారిగా భారీ ఎగబాకింది. దీంతో రాబోయే రోజుల్లో మరిన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu