Jagitial: బస్ షెల్టరా? మట్టి కుప్పా? మల్యాల ప్రయాణికుల నరకం!
జగిత్యాల జిల్లా: మల్యాల మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న బస్ షెల్టర్ నిర్లక్ష్యానికి గురై ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది.
ఏడాది కాలంగా షెల్టర్ లోపల కంకర, మట్టి కుప్పలు పేరుకుపోయి ఉండడంతో ప్రయాణికులు లోపలికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వర్షం, ఎండల నుంచి రక్షణ కల్పించాల్సిన ఈ షెల్టర్ ప్రస్తుతం ఉపయోగించలేని స్థితికి చేరుకుంది. ఇక షెల్టర్ ముందు బైక్‌లను నిర్బంధంగా పార్క్ చేయడం సమస్యను మరింత తీవ్రమైంది. వాహనాల కారణంగా ప్రయాణికులు షెల్టర్‌లోకి వెళ్లలేకపోతుండటంతో ఎండలోనే రోడ్డుపై నిలబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్థానికులు పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన బస్ షెల్టర్ నిరుపయోగంగా మారిపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి షెల్టర్‌లో పేరుకుపోయిన మట్టిని తొలగించి, ముందు పార్కింగ్ సమస్యను నివారించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

