Jupally Krishna Rao: 'నేను చెప్పింది అబద్ధమైతే రాజీనామాకు సిద్ధం'.. జూపల్లి సవాల్!
Jupally Krishna Rao: తెలంగాణ రాష్ట్రంలో అప్పుల వివరాలపై కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు పీక్స్‌కు చేరాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టాను బయటపెడుతూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చేసిన ఆరోపణలు అబద్ధమైతే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని జూపల్లి సవాల్ విసరగా.. చర్చకు రాకుండా మంత్రి పారిపోయారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానాను అప్పులపాలు చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం ఏకంగా 7.3 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని ఆయన ఆరోపించారు. ఇందులో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే కార్పొరేషన్ల పేరుతో 74 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారని వెల్లడించారు. ఈ అపారమైన అప్పుల కారణంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 6 వేల కోట్ల రూపాయల చొప్పున కేవలం వడ్డీల రూపంలోనే చెల్లించాల్సి వస్తోందని జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
"నేను చేసిన ప్రతి వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లుతున్న కేటీఆర్, హరీశ్‌రావు ఇప్పటికీ వాస్తవాలను బుకాయిస్తున్నారు. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన ఈ 74 వేల కోట్ల కాళేశ్వరం అప్పులను ఇప్పుడు రైతుల నుంచి వసూలు చేస్తారా? ఒక్కో రైతుపై 20 లక్షల భారం వేస్తారా? నా వద్ద ఉన్న రికార్డులు, కాగితాలు ఇవ్వడానికి నేను సిద్ధం. మేము చేసిన ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? ఆయన స్వయంగా media ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి" అని మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీశారు.
మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌కు వస్తానని స్వయంగా సవాల్ విసిరిన మంత్రి జూపల్లి.. తీరా సమయానికి ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు.
జూపల్లి వస్తారనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో వేచి చూశారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. చర్చకు రమ్మంటే కాంగ్రెస్ మంత్రులు తోక ముడిచి పారిపోయారని, కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇరు partyల సవాళ్లతో తెలంగాణ రాజకీయాల్లో అప్పుల వేడి మరింత రాజుకుంది.

