Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jyothi Lakshmi: ఇండస్ట్రీని ఊపేసిన జ్యోతిలక్ష్మి... ముంబైకి ఎందుకు పారిపోయిందో తెలుసా?

Jyothi Lakshmi: ఇండస్ట్రీని ఊపేసిన జ్యోతిలక్ష్మి... ముంబైకి ఎందుకు పారిపోయిందో తెలుసా?

hmtv 3 weeks ago

Jyothi Lakshmi: మన చిన్నప్పుడు గ్రామాల్లో ఓ పాట వినేవాళ్లం...జ్యోతిలక్ష్మి చీరకట్టింది...చీరకే సిగ్గేసింది.. అని. ఈ పాట ఎందుకు అంత ఫేమస్‌ అయింది అంటే ఆ పాటలో జ్యోతిలక్ష్మి పేరు ఉండబట్టే అనే వాళ్లు ఎందరో ఉన్నారు.

దక్షిణాదిన ప్రత్యేక గీతం అంటే మనకు గుర్తుకు వచ్చేసి సిల్క్‌స్మిత. కానీ, సిల్క్‌స్మిత కంటే ముందే తన డ్యాన్స్‌తో ఆనాటి కుర్రకారును ఉర్రూతలూగించిన నటి జ్యోతిలక్ష్మి. 1970వ దశకంలో జ్యోతిలక్ష్మి పాట లేని సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. వెయ్యికి పైగా పాటల్లో నర్తించి, 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్థానం ఒక సంచలనం. అయితే, తెరపై గ్లామర్‌తో మెరిసిన ఈ నటి జీవితం వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె ముంబైకి పారిపోవాల్సి వచ్చిన సంఘటన ఆమె జీవితంలో అత్యంత విషాదకరం.

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఎదురైన అవమానాలు

డ్యాన్స్‌ జ్యోతిలక్ష్మి వృత్తి. అంతేకాదు, ఆమెకు డ్యాన్స్‌ చేయడం అంటే ప్రాణం. కానీ, ఆమె వృత్తి వలనే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సినీ కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగా... చెన్నైలో ఆమెకు ఇల్లు అవసరమైంది. ఇల్లు అద్దెకు తీసుకోవాలని వెళ్తే... నీలాంటి డ్యాన్సర్లకు ఇల్లు ఇవ్వం అని ముఖంమీదే తిరస్కరించినట్టు జ్యోతిలక్ష్మీ పేర్కొంది. నృత్యం నా వృత్తి, అది నా క్యారెక్టర్‌ను ఎలా నిర్ణయిస్తుంది అని ఆమె ఆవేదన చెందేవారు. వృత్తిపరమైన జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరు అని భావించిన జ్యోతిలక్ష్మి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ నుంచి ఆ తరువాత తరం హీరోలైన చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోల చిత్రాల్లోనూ ప్రత్యేక నృత్యం చేసి మెప్పించారు. జ్యోతిలక్ష్మి ఉంటే చాలు సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందనే రోజులు కూడా ఎన్నో ఉన్నాయి.

ముంబైకి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది?

వృత్తిపరమైన జీవితంలో బొమ్మ హిట్టైనా...వ్యక్తిగత జీవితం ఆమెకు శాపంగా మారింది. తన తల్లి కోరిక మేరకు వాసుదేవన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, అతనికి అప్పటికే పెళ్లయింది. పిల్లలు లేకుంటే జ్యోతిలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. కానీ, మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. కేవలం సహజీవనం పేరుతో కలిసి ఉన్నారు. ఎనిమిదేళ్లపాటు వాసుదేవన్‌తో కలిసి ఉన్నారు. ఆ ఎనిమిదేళ్లు ఆమెకు నరకం కనిపించింది. వాసుదేవన్‌ ఆమెను తీవ్రంగా వేధించినట్టుగా చెబుతారు. వాసుదేవన్‌ ప్రవర్తన కారణంగా జ్యోతిలక్ష్మి పలు సినిమాలను వదులుకోవలసి వచ్చింది. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఎవరికీ చెప్పకుండా ముంబైకి పారిపోయారు. కొంతకాలం ముంబైలో ఉండి తనకంటూ కొంత ధైర్యాన్ని తెచ్చుకొని తిరిగి చెన్నై వచ్చి వాసుదేవన్‌తో సంబంధాన్ని తెంచుకున్నారు. ఆ తరువాత సినిమాటోగ్రాఫర్‌ సాయి ప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు.

ఎంత గొప్ప జీవితానికైనా ఎక్కడో ఒకచోట ఎదురుదెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఎదురుదెబ్బలు తగిలినపుడు మరింత రాటుదేలాలి. మెదడుకు పదును పెట్టాలి. కష్టపడి పనిచేయాలి. జ్యోతిలక్ష్మి అలానే చేసింది. అన్ని భాషల్లోనూ తన ఆటతో ప్రేక్షకులను అలరించిన జ్యోతిలక్ష్మి 2016 ఆగస్టు 9న బ్లడ్‌ క్యాన్సర్‌తో కన్నుమూసింది. వెండితెరపై వెలిగే ప్రతి రంగుల ప్రపంచం వెనుక ఓ చీకటి నిజం ఉంటుంది. దానికి ఎందరో నటీనటులు ఉదాహరణగా నిలిచారు. కొందరి జీవితం అర్థాంతరంగా ముగిస్తే...మరికొందరి జీవితం సంపూర్ణంగా ముగుస్తుంది. మహేష్‌బాబు చెప్పినట్టు ఎప్పుడు వచ్చామన్నది కాదు... ఎలా ముగించామన్నదే ముఖ్యం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu