Kalvakuntla Kavitha: సెక్రటేరియట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కవిత అరెస్ట్
Kalvakuntla Kavitha: రాష్ట్రంలో వరి ధాన్యం, జొన్నల కొనుగోలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో శుక్రవారం సెక్రటేరియట్ వద్ద భారీ నిరసన ప్రదర్శన జరిగింది.
సచివాలయం ఎదుట ప్రధాన రహదారిపై వరి ధాన్యాన్ని పోసి కవిత తన పార్టీ శ్రేణులతో కలిసి ధర్నాకు దిగారు. దీంతో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. "రాష్ట్రవ్యాప్తంగా కల్లాల్లోనే ధాన్యం ఎండిపోతోంది. అన్నదాతలను ప్రభుత్వం అరిగోసలు పెడుతోంది. తెలంగాణ రైతుల బాధలు, వారి గోస ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి తెలియాలనే నేరుగా సచివాలయం వద్దకు వచ్చి నిరసన తెలుపుతున్నాం" అని ఆమె స్పష్టం చేశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నా.. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా కనీసం సమీక్ష నిర్వహించకపోవడం రైతుల పట్ల వారికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యంతో పాటు, జొన్నలను కూడా తక్షణమే మద్దతు ధరతో పాటు బోనస్ అందించి కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
సెక్రటేరియట్ వద్ద ధర్నా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. కవితతో పాటు నిరసనలో పాల్గొన్న పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైతుల సమస్యలపై తమ పోరాటం ఆగదని, కొనుగోళ్లు పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో రైతుల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా టి.ఆర్.ఎస్ (TRS) శ్రేణులు నినాదాలు చేశారు.

