Karimnagar: బానిస సంకెళ్లు తెంచిన మేధావి కారల్ మార్క్స్ 209వ జయంతి!
కరీంనగర్: ప్రపంచ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన మహోన్నత వ్యక్తి కారల్ మార్క్స్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి కొనియాడారు.
సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కార్యాలయం ముకుందలాల్ మిశ్రాభవన్లో కారల్ మార్క్స్209వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ 1846లో జర్మన్ భావజాల గ్రంథం ద్వారా నూతన సిద్ధాంతమైన గతితార్కిక భౌతిక సూత్రాలను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, కారల్ మార్క్స్ అని కొనియాడారు.
అత్యధిక ప్రజలకు అమిత సంతోషం కలిగించే వాడే నిజమైన అదృష్టవంతులని తన జీవితం మొత్తం సర్వస్వాన్ని ప్రజల సంతోషానికి అంకితం చేసిన గొప్ప దార్శనికుడు కారల్ మార్క్స్ అని గుర్తు చేశారు. ప్రతి పోరాటంలో మార్క్స్ మార్గదర్శకంగా కనిపిస్తాడని, ప్రపంచ ప్రఖ్యాత సిద్ధాంతవేత్త చారిత్రక భౌతిక వాదం, వర్గ పోరాటం, సోషలిస్టు విప్లవాల గురించి వివరణ ఇస్తూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి.పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప. అనే పిలుపుతో రాయబడ్డ కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచ ప్రఖ్యాతి చెందిందన్నారు. కార్మిక వర్గానికి వెలుగు బాటలు వేసిందన్నారు.
25 ఏళ్ల సమయాన్ని వెచ్చించి పెట్టుబదిదారి విధానాన్ని కూల్చివేసే పెట్టుబడి గ్రంథాన్ని పూర్తి చేశారని, ఇది కార్మిక వర్గానికి కార్మిక వర్గం చేతికి నూతన ఆయుధాన్ని ఇచ్చిందన్నారు. ఆయన మరణించి 143 సంవత్సరాలు గడిచినప్పటికీ మానవాళిపై ఆయన ప్రభావం ఇంకా పెరుగుతూనే ఉందన్నారు. ప్రస్తుతం దోపిడి వర్గాలు మార్క్సిజం లేదని వాదిస్తున్నప్పటికీ కోట్లాది కార్మికులు, పిడిత ప్రజలు తమ విముక్తి కోసం.
మార్క్సిజాన్ని అనుసరిస్తున్నార న్నా రు. ఇప్పటికీ మార్క్సిజమే సమాజాన్ని ముందుకు నడిపించగలదని చరిత్ర నిరూపించిందన్నారు. యుద్ధాలు, సంక్షోభాలు, అసమానతలు ఇవన్నీ యాదృచ్ఛికంగా వచ్చేవి కావని, అవి సమాజంలోని ఆర్థిక నిర్మాణాలతో ఇమిడి ఉంటాయని శాస్త్రీయంగా వివరించి నిరూపించిన మేధావి మార్క్స్ అన్నారు. ఒక వ్యక్తి ఆలోచనలు శతాబ్దాల పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేయడం సాధారణ విషయం కాదన్నారు. మార్క్స్ ఒక వ్యక్తి కాదని సమాజాన్ని కదిలించే నిత్య నూతన చోదక శక్తి అని కొనియాడారు. దేశంలో బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను హరించి వేస్తూ పెట్టుబడిదారుల కోమ్ముకాస్తుందన్నారు అన్నారు.
విద్యుత్ సంస్కరణల చట్టం, విత్తన చట్టం తెచ్చి రైతులను భూమి నుండి వేరు చేసే కుట్రలు చేస్తుందన్నారు. ఉపాధి హామీ కూలీల పొట్టగొట్టే వి బి జి రామ్ జి చట్టాన్ని తెచ్చింది అన్నారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోళ్లుగా తయారుచేసి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందన్నారు.కరల్ మార్క్స్ స్ఫూర్తితో నిరంతర అధ్యయనం, త్యాగ నిరతితో జిల్లాలో బలమైన ప్రజా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు డి.నరేష్ పటేల్. నాయకులు రాయి కంటి శ్రీనివాస్, గజ్జల శ్రీకాంత్, కాంపెళ్లి అరవింద్, ఏ శివ, యూ. మానస తదితరులు పాల్గొన్నారు.

