Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: బక్రీద్ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

Karimnagar: బక్రీద్ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

hmtv 5 days ago

Karimnagar: బక్రీద్ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మంగపేట వద్ద బక్రీద్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఈరోజు సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అక్రమంగా ఆవులు, గోవులు మరియు ఇతర నిషేధిత జంతువుల రవాణాను అరికట్టేందుకు చేపడుతున్న చర్యలను ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ రవాణా ద్వారా పశువులను మాంసం విక్రయ కేంద్రాలకు తరలించే అవకాశాలు ఉన్నందున జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధాన రహదారులు, సరిహద్దు ప్రాంతాలు, గ్రామీణ మార్గాలపై పోలీసులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి కమిషనర్ పలు కీలక సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ముఖ్యంగా పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా జంతువుల రవాణా జరిగితే వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని, చెక్‌పోస్ట్ వద్ద సీసీ కెమెరాలు, లైటింగ్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అనుమానాస్పద వాహనాల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని స్పష్టం చేశారు.

జంతు అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రజల సహకారం కూడా కీలకమని కమిషనర్ గౌస్ ఆలం పేర్కొన్నారు. అనుమానాస్పదంగా పశువులను తరలిస్తున్న వాహనాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఈ ఆకస్మిక తనిఖీల్లో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu