Post Office: Post Office: ఇలా చేస్తే.. రిటైర్ అవ్వకముందే, ప్రతీ నెల మీ ఖాతాలోకి రూ. 5500!
Post Office: చేతిలో ఉన్న డబ్బును భద్రంగా దాచుకోవడంతో పాటు ప్రతి నెలా కొంత ఆదాయం రావాలని చాలామంది కోరుకుంటారు.
అలాంటి వారికి పోస్టాఫీస్ పొదుపు పథకాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి వాటిలో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ఒకటి.
ఒక్కసారి డిపాజిట్.. ప్రతినెలా వడ్డీ ఆదాయం
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది ఒకేసారి పెట్టుబడి పెట్టి, నెలవారీ వడ్డీ పొందే పొదుపు పథకం. ఇందులో తరచూ డబ్బులు జమ చేయాల్సిన అవసరం ఉండదు. ఖాతా ప్రారంభించే సమయంలో నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ప్రతి నెలా వడ్డీని ఖాతాదారుడికి చెల్లిస్తారు. ఈ పథకంలో కనీసం రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా ఇందులో చేరేందుకు అర్హులు. సాధారణ పొదుపు ఖాతాతో పాటు ఉమ్మడి ఖాతా సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఒక జాయింట్ ఖాతాలో గరిష్టంగా ముగ్గురు పెద్దలు కలిసి పెట్టుబడి పెట్టవచ్చు.
వడ్డీ రేటు ఎంత? గరిష్టంగా ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?
ఈ పథకానికి ఐదేళ్ల మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం వార్షిక వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. ఒక వ్యక్తి సింగిల్ ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అదే జాయింట్ ఖాతా ద్వారా అయితే గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.15 లక్షలు. పెట్టుబడి చేసిన నెల నుంచే వడ్డీ లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రతి నెలా వచ్చే వడ్డీని నిర్ణీత పద్ధతిలో ఖాతాదారుడికి అందిస్తారు. ఇలా ఐదేళ్లపాటు క్రమం తప్పకుండా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
రూ.9 లక్షలు పెడితే నెలకు రూ.5,500..
ఈ పథకంలో పెట్టుబడి మొత్తాన్ని బట్టి నెలవారీ ఆదాయం మారుతుంది. ఉదాహరణకు 7.40 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం సింగిల్ ఖాతాలో రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.5,550 వడ్డీ లభిస్తుంది. అంటే ఏడాదికి రూ.66,600 ఆదాయం వస్తుంది. ఐదేళ్ల కాలానికి మొత్తం వడ్డీ రూ.3,33,000 అవుతుంది. అదే జాయింట్ ఖాతాలో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.9,250 వడ్డీ పొందవచ్చు. అయితే మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు అసలు పెట్టుబడి ఖాతాలోనే ఉంటుంది. ఐదేళ్ల గడువు ముగిసిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి తీసుకోవచ్చు. నెలవారీ ఆదాయం అవసరమైన కుటుంబాలు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.
మధ్యలో ఖాతా మూసేస్తే నష్టమా? ఎలా దరఖాస్తు చేయాలి?
ఐదేళ్ల గడువు పూర్తికాకముందే ఖాతాను క్లోజ్ చేయాలంటే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఖాతా ప్రారంభించిన ఏడాది వరకు ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉండదు. ఏడాది పూర్తయ్యాక, మూడేళ్లలోపు ఖాతాను మూసివేస్తే డిపాజిట్ చేసిన అసలు మొత్తంలో 2 శాతం మినహాయిస్తారు. మూడేళ్ల తర్వాత ఐదేళ్లలోపు మూసివేస్తే 1 శాతం తగ్గిస్తారు. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో ఖాతాను మూసివేసి, నిబంధనల ప్రకారం డిపాజిట్ మొత్తాన్ని నామినీకి లేదా చట్టబద్ధ వారసులకు చెల్లిస్తారు.
ఈ పథకంలో చేరాలనుకునేవారు సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించవచ్చు. అక్కడ MIS ఖాతా ప్రారంభించేందుకు దరఖాస్తు ఫారం తీసుకుని పూర్తి వివరాలు నమోదు చేయాలి. గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్, పాన్ కార్డు, అవసరమైన KYC పత్రాలను సమర్పించాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేసి ఖాతా ప్రారంభించవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు అప్పటి వడ్డీ రేటు, డిపాజిట్ పరిమితులు, ఇతర నిబంధనలను పోస్టాఫీసులో నిర్ధారించుకోవడం మంచిది.

