Karimnagar: కరీంనగర్‌లో మోడరన్ 'ఏబీసీ' సెంటర్ ప్రారంభం!
కరీంనగర్: నగరంలో వీధి కుక్కల నియంత్రణ, జంతు సంక్షేమం మరియు ప్రజారోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) సెంటర్‌ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేందుకు ఏబీసీ సెంటర్ కీలకంగా మారుతుందని తెలిపారు. జంతువులకు హాని కలగకుండా శాస్త్రీయ విధానంలో శస్త్రచికిత్సలు నిర్వహించి తిరిగి వాటిని సంరక్షణతో విడిచిపెట్టడం జరుగుతుందన్నారు. ప్రజల భద్రతతో పాటు జంతు సంక్షేమాన్ని సమానంగా కాపాడే విధంగా నగర పాలక సంస్థ చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ కేంద్రంలో శస్త్రచికిత్సలు, వ్యాక్సినేషన్, వైద్య పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని మేయర్ వెల్లడించారు. జంతువుల పట్ల ప్రేమ, బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు , మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కమిషనర్ సువార్త ,కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, వెటర్నరీ వైద్యులు, జంతు సంక్షేమ సంస్థల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

