Karimnagar: నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి
కరీంనగర్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే, కేంద్ర ప్రభుత్వం మే 8వ తేదీన దేశవ్యాప్తంగా నాలుగు కార్మిక కోడ్‌లకు సంబంధించిన నిబంధనలను గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఏకపక్షంగా ఖరారు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (TMSRU) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ నిరసన ప్రదర్శనను ఉద్దేశించి TMSRU రాష్ట్ర అధ్యక్షులు చీకోటి శ్రీధర్ మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ యాజమాన్యాలకు ఊడిగం చేస్తూ, దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను బలహీనపరిచేందుకే ఈ నల్ల చట్టాల రూల్స్‌ను తీసుకొచ్చిందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కొత్త కోడ్‌ల వల్ల కార్మికుల ఉద్యోగ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లడమే కాకుండా, ప్రశ్నించే ట్రేడ్ యూనియన్ల పాత్రను తగ్గించేలా నిబంధనలు ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా "ఫిక్స్ డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్" పేరుతో పర్మనెంట్ ఉద్యోగాల సంస్కృతిని దెబ్బతీసి, కార్మికులను తీవ్ర అభద్రతాభావంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని, యాజమాన్యాలకు అనుకూలంగా పనిగంటలను 8 గంటల నుండి 12 గంటల వరకు పొడిగించుకునేలా అవకాశం కల్పించడం కార్మిక లోకాన్ని వంచించడమేనని ఆయన దుయ్యబట్టారు.
ఈ నల్ల చట్టాల వల్ల మెడికల్ మరియు సేల్స్ రిప్రజెంటేటివ్స్ రంగానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న "సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ 1976" ని ఈ కొత్త కోడ్‌లలో విలీనం చేయడం ద్వారా, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్‌కు చట్టపరంగా ఉన్న రక్షణలు, ప్రత్యేక సెలవులు, స్థిరమైన పనివేళల నిబంధనల అమలులో అనేక అవరోధాలు, చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ఉద్యోగులు తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతూ, యాజమాన్యాల వేధింపులను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో గెలవగానే కార్పొరేట్ శక్తుల ఎజెండాను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై TMSRU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్మిక వ్యతిరేకమైన ఈ 4 కోడ్‌లను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే "సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ 1976" ద్వారా లభించే రక్షణలను యథావిధిగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఈ నల్ల చట్టాలను రద్దు చేయని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం మరిన్ని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, మెడికల్ రిప్రజెంటేటివ్స్, కార్మికులు అందరూ కలిసికట్టుగా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి గుండా శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిరుపాల అంజయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి పూదరి హరీష్ , సహ కార్యదర్శి పబ్బ నరేందర్, జిల్లా సహాధ్యక్షుడు అన్నారం బాలకృష్ణ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

