Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kashi Tilbhandeshwar: 2వేల సంవత్సరాలుగా పెరుగుతున్న శివలింగం...కాశీ తిలబందేశ్వర్‌ రహస్యం

Kashi Tilbhandeshwar: 2వేల సంవత్సరాలుగా పెరుగుతున్న శివలింగం...కాశీ తిలబందేశ్వర్‌ రహస్యం

hmtv 6 days ago

Kashi Tilbhandeshwar: హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నగరంలో ఒక అద్భుతమైన పరమశివుని ఆలయం ఉంది. అదే తిలబందేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఇక్కడి విశేషం ఏంటంటే, గర్భాలయంలోని స్వయంభూ శివలింగం గత 2,000 సంవత్సరాలుగా ప్రతి ఏటా నువ్వు గింజ పరిమాణంలో పెరుగుతూ వస్తోంది.

ప్రస్తుతం ఈ శివలింగం భూమిపైకి 3.5 అడుగుల ఎత్తు, పీఠం వ్యాసం 3 అడుగులతో కనిపిస్తున్నప్పటికీ, దీని అసలు పరిమాణం భూగర్భంలో దాదాపు 20 అడుగుల లోతు వరకు విస్తరించి ఉండటం ఒక అంతుచిక్కని దైవ రహస్యం. ఇంతటి ప్రాశస్త్యమైన తిలబందేశ్వర్‌ ఆలయం గురించి తెలుసుకుందాం.

స్వయంభూ లింగం - పురాణ ప్రాశస్త్యం

వారణాసిలోని పాండా హవేలీ ప్రాంతంలో వెలసిన ఈ తిలబందేశ్వర్ ఆలయానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. శివపురాణంలో సైతం ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. నాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు, శారదా మాత వంటి ఆధ్యాత్మిక మూర్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి, ఇక్కడి పరమశివుని చెంత ధ్యానంలో గడిపారని ప్రతీతి. 18వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆదిశంకరులు ధ్యానం చేసిన ఈ ఆలయంలో కాసేపు మౌనంగా కూర్చుంటే చాలు మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని పండితులు చెబుతున్నారు.

పెరగడం వెనుక ఉన్న భిన్న వాదనలు

ఈ లింగం నిరంతరం విస్తరిస్తూ గర్భాలయాన్ని ఆక్రమిస్తుండటం వెనుక రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది భక్తులు దీనిని కాశీ విశ్వనాథుని మహిమకు తార్కాణంగా చెబితే... మరికొందరు స్వామివారు జీవకళతో ఇక్కడ పెరుగుతున్నారని అంటారు. ఇక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, భూమి అడుగున ఉన్న పలకల కదలికల వలన శివలింగం పైకి వస్తోందని అంటున్నారు. అయితే, దీనికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడంతో ఇదొక దైవిక రహస్యంగానే మిగిలిపోయింది. శివలింగం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ప్రతి ఏడాది నువ్వు గింజ పరిమాణంలో పెరుగుతుండటం విశేషం.

ఆలయ సంస్కృతి - ప్రత్యేక పూజలు

ఈ ఆలయ వాస్తు శిల్ప శైలిలో ఉత్తర భారత, దక్షిణ భారత, కేరళ సంప్రదాయాల అద్భుత మేళవింపు కనిపిస్తుంది. ఇక్కడ రోజుకు 4 సార్లు మహా హారతి ఇస్తారు. ప్రతి హారతికి ముందు గర్భాలయాన్ని పవిత్ర జలాలతో శుభ్రం చేయడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. శ్రావణ మాసంలో, మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జరిగే అభిషేకాలు చూడటానికి రెండు కళ్ళూ చాలవు. కాశీ విశ్వనాథుని ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని నిత్యం భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu