Dailyhunt
Kasturi Siva Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలితరం కమెడియన్‌ - బానిసైతే మరణం ఇలానే ఉంటుంది

Kasturi Siva Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలితరం కమెడియన్‌ - బానిసైతే మరణం ఇలానే ఉంటుంది

hmtv 1 week ago

Kasturi Siva Rao: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోలతో సమానమైన పారితోషికం అందుకున్న తొలి హాస్యనటుడు, "దేవుడయ్యా దేవుడు" అంటూ జనాన్ని ఉర్రూతలూగించిన కస్తూరి శివరావు జీవితం..

ఒక అద్భుతమైన కావ్యంగా మొదలై, అత్యంత దారుణమైన విషాదాంతంతో ముగిసింది. అపారమైన సంపదను వ్యసనాలకు ధారపోస్తే కాలం ఎంత క్రూరంగా శిక్షిస్తుందో చెప్పడానికి ఆయన జీవితమే ఒక ఉదాహరణ.

శిఖరాగ్రాన స్టార్‌డమ్

పశ్చిమగోదావరి జిల్లా కాకినాడకు చెందిన శివరావు గారు కేవలం నటుడు మాత్రమే కాదు, ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని శక్తి. 1940వ దశకంలో 'బాలరాజు' చిత్రం సాధించిన ఘనవిజయం ఆయనను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసింది. కాకినాడలోని మినర్వా టాకీస్‌లో బాలరాజు సినిమా ఏకంగా సంవత్సరం పాటు ఆడిందంటే అందులో నటించిన శివరావు క్రేజ్‌ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో ఆయన హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే కమెడియన్‌గా మారిపోయారు. ఇక శివరావు ఇంటిపక్కనే ఉన్న ఇంట్లో ఎన్టీఆర్‌ ఉండేవారట. ఎన్టీఆర్‌ను చూసేందుకు వచ్చిన జనం, శివరావు ఇంటిముందు కూడా క్యూకట్టేవారు.

విలాసం.. వ్యసనం.. పతనం

శివరావు గారి వైభవం ఎంతలా ఉండేదంటే, ఆయన ప్రతిరోజూ పన్నీటితో స్నానం చేసేవారని అప్పట్లో చెప్పుకునేవారు. దానగుణంలో ఆయనను మించిన వారు లేరు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, చేతికి వచ్చిన నోట్ల కట్టలను ఇచ్చేసేవారు. ఇలా దానంతో పాటు మద్యం కూడా అలవాటైంది. ఆ తరువాత అది వ్యసనంగా మారిపోయింది. 1950లో 'పరమానందయ్య శిష్యులు' చిత్రంతో దర్శకుడిగా మారి చేతులు కాల్చుకోవడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో రేలంగి వంటి కొత్త నటులు రావడం, షూటింగ్‌లకు తాగేసి రావడం వల్ల నిర్మాతలు ఆయనను దూరం పెట్టారు.

రైల్వే స్టేషన్ బయట అనాథగా..

1966 ఫిబ్రవరి 25.. తెలుగు సినీ చరిత్రలో ఒక మాయని మచ్చ. ఒకప్పుడు ఖరీదైన 'బ్యూక్' కారులో తిరిగిన ఈ హాస్య చక్రవర్తి, కేవలం 44 ఏళ్ల వయసులోనే తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన శవమై కనిపించారు. ఆయన ఎవరో కూడా గుర్తు పట్టే నాధుడు లేకపోవడం విషాదకరం. చివరకు ఆయన మృతదేహాన్ని మద్రాసు తరలించడానికి టాక్సీ డ్రైవర్‌ కూడా అభ్యంతరం చెప్పడంతో...స్టార్‌గా వెలిగిన ఆ మహానటుడి భౌతిక కాయాన్ని కారుడిక్కీలో దాచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత వెలుగు వెలిగిన మహానటుడి దహన సంస్కారాలకు కూడా చిల్లిగవ్వ కూడా లేని స్థితిలో రాజబాబు, అల్లు రామలింగయ్య, రేలంగి వంటి సహచర నటులు చందాలు వేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు.

హాస్య నటుడు కస్తూరి శివరావు గారి జీవితం నేటి తరం నటులకు ఒక గొప్ప పాఠం. "శూన్యం నుంచి మొదలై శూన్యంలోనే కలిసిపోయిన" ఆయన ప్రస్థానం, క్రమశిక్షణ లేని ప్రతిభ ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తుంది. తెరపై ప్రపంచాన్ని నవ్వించిన ఆ పెదవులు, తెర వెనుక మాత్రం కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. బహుశా ఇలాంటివారిని దృష్టిలో ఉంచుకొనే నేటితరం నటులు జాగ్రత్త పడుతున్నారు. దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu