Khammam: నిరుద్యోగులకు వరం.. మే 4న ఖమ్మంలో భారీ ఉద్యోగ మేళా
Khammam: ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మే 4న ఉదయం 9 గంటల నుండి ఎస్.ఆర్.గార్డెన్స్, ఖమ్మంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు, ఇట్టి అవకాశాన్ని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళాలో సుమారు 93 కంపెనీలు పాల్గొంటున్నాయని, 4000కు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా, తయారీ, మార్కెటింగ్, టెలికమ్యూనికేషన్, కస్టమర్ కేర్, లాజిస్టిక్స్ తదితర విభిన్న రంగాల్లో ఈ అవకాశాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
జిల్లాలోని యువతకు నేరుగా ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి నైపుణ్యాలను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించడం ఈ జాబ్ మేళా ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.
ఈ నేపథ్యంలో 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ తదితర అర్హతలు కలిగిన ప్రతి యువకుడు, యువతి ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. అభ్యర్థులుతమ రెజ్యూమ్‌లతో హాజరుకావడంతో పాటు https://satg.telangana.gov.in/prajapalana వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
యువత ఉపాధి పొందడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ దిశగా జిల్లా పరిపాలన యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

