Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kotha Malupu Trailer Launch: జూన్ 12న 'కొత్త మలుపు'.. ఆకట్టుకుంటున్న గాయని సునీత తనయుడు ఆకాష్ చిత్ర ట్రైలర్!

Kotha Malupu Trailer Launch: జూన్ 12న 'కొత్త మలుపు'.. ఆకట్టుకుంటున్న గాయని సునీత తనయుడు ఆకాష్ చిత్ర ట్రైలర్!

hmtv 1 week ago

Kotha Malupu Trailer Launch: జూన్ 12న 'కొత్త మలుపు'.. ఆకట్టుకుంటున్న గాయని సునీత తనయుడు ఆకాష్ చిత్ర ట్రైలర్!

Kotha Malupu Trailer Launch: ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కొత్త మలుపు' విడుదలకు సిద్ధమైంది.

భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుండటం విశేషం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, గాయని సునీత, ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కింది. సినిమాలో ప్రేమ, సస్పెన్స్, హాస్యం, కుటుంబ భావోద్వేగాలు సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో ఆకాష్, భైరవి బావ-మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. చిత్ర దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ, "కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్-భైరవి జోడీ స్క్రీన్‌పై చాలా బాగా కుదిరింది. జూన్ 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం" అని పేర్కొన్నారు.

సింగర్ సునీత మాట్లాడుతూ, "ఆకాష్ ఎంతో కష్టపడే వ్యక్తి. హీరోగా ఇది అతనికి రెండో సినిమా. దర్శకుడు శివ ప్రేక్షకులను అలరించే అద్భుతమైన కథను సిద్ధం చేశారు. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రానికి అండగా నిలవడం మాకు ఎంతో గర్వకారణం" అని ఆనందం వ్యక్తం చేశారు.

హీరో ఆకాష్ మాట్లాడుతూ, తనకు మంచి కథను అందించిన దర్శకుడికి, మద్దతుగా నిలిచిన మైత్రి మూవీస్ సంస్థకు, తన తల్లి సునీతకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ భైరవి ఆర్థ్యా మాట్లాడుతూ, తన కెరీర్‌లో 'కొత్త మలుపు' చాలా ప్రత్యేకమైన చిత్రమని, బావ-మరదళ్ల కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మించినట్లు నిర్మాత తాటి బాలకృష్ణ తెలిపారు. గ్రామీణ నేపథ్యం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సీనియర్ నటుడు భానుచందర్, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబులు ట్రైలర్ చాలా బాగుందని, మైత్రి సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండటంతో సినిమా స్థాయి పెరిగిందని, ఈ చిన్న చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, యశ్వంత్ సంగీతాన్ని అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో రూపొందిన 'కొత్త మలుపు' జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu