Kothagudem: రైతన్నలకు పండుగలా రైతు వారోత్సవాలు కొత్తగూడెంలో ఎమ్మెల్యే
కొత్తగూడెం జిల్లా: పండుగ వాతావరణంలో ప్రారంభమైన రైతు వారోత్సవాలు కొత్తగూడెం- చుంచుపల్లి రైతు వేదికలో రైతు వారోత్సవాలను ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, KVK శాస్త్రవేత్తలు, యానిమల్ హస్బండరీ,వెటర్నరీ, మార్కెటింగ్ అధికారులు, రైతులు, డీలర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ...
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలను నేటి నుంచి ప్రారంభించుకోవడం జరుగుతున్నదని తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులకు రైతులకు పలు సూచనలు చేశారు.రైతులు యూరియాను అధిక మోతాదులో వాడొద్దని,భూసారం దెబ్బతినకుండా, భూమి చౌడు పడకుండా,పంట మార్పిడి పద్దతులను పాటించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనలు సలహాలు రైతులు పాటించాలని కోరారు. అనంతరం రైతు ముంగిటకు శాస్త్రవేత్తలు కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి (డిఏఓ) బాబురావు ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 67 రైతు వేదికల్లో నేటి నుంచి రైతు వారోత్సవాలను ప్రారంభించడం జరిగిందని, ఈ నెల 4వ తారీఖు నుంచి మే 9వ తారీకు వరకు రైతు వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
ప్రధానంగా నాలుగు అంశాల పైన రైతు వారోత్సవాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ పరిరక్షణ, సమతుల్యమైన ఎరువుల వాడకం, ప్రకృతి వ్యవసాయం వచ్చే వానాకాలం సీజన్లో వేసుకొబోయే వరి రకాల గురించి అవగాహన కల్పించడం వంటి అంశాలు ఉంటాయన్నారు. రైతు ముంగిటకు శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు కె వి కే శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయం, అవగాహన సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రధానంగా రైతులు యూరియాను అధిక మోతాదులో వాడకుండా భూసారం దెబ్బతినకుండా, భూమి చౌడు పడకుండా పంటల మార్పిడి పద్ధతులని అనుసరించి సాగు చేయాలని..
వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించడం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడం మరియు రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన అంశాలని తెలిపారు. శాస్త్రవేత్తలు గ్రామాలకు నేరుగా వెళ్లి రైతులకు ఎరువుల యాజమాన్యం, యూరియా వాడకాన్ని తగ్గించడం, మరియు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడటం, పంట మార్పిడి, ఒకే పంటను కాకుండా భూసారానికి అనుగుణంగా లాభసాటి పంటలను సాగు చేయడం గురించి అవగాహన కల్పిస్తారని వివరించారు.

