Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్షమాపణలు రీల్స్‌కే పరిమితమా? ప్రధాని మోదీని ప్రశ్నించిన CJP అధినేత!

క్షమాపణలు రీల్స్‌కే పరిమితమా? ప్రధాని మోదీని ప్రశ్నించిన CJP అధినేత!

hmtv 3 weeks ago

క్షమాపణలు రీల్స్‌కే పరిమితమా? ప్రధాని మోదీని ప్రశ్నించిన CJP అధినేత!

Abhijeet Dipke: జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో తనపై, తన దివంగత తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతను క్షమిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో కొత్త రాజకీయ చర్చ మొదలైంది.

ప్రధాని మోదీ ప్రకటనపై 'కాక్రోచ్‌ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దిప్కే ఘాటుగా స్పందించారు. క్షమాపణలు కేవలం సోషల్ మీడియా వీడియోలకే పరిమితం కాకూడదని, ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్ (ట్విట్టర్) ద్వారా యువతతో సంభాషిస్తున్న ప్రధాని మోదీ, తాజాగా విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో విద్యార్థుల వ్యాఖ్యలపై స్పందించారు. "జంతర్‌మంతర్ ఆందోళనల్లో కొందరు విద్యార్థులు అత్యంత అభ్యంతరకరమైన, అసభ్యకర భాషను ఉపయోగించారు. వ్యక్తిగతంగా నన్ను, నా తల్లిని తీవ్రంగా దూషించారు. కానీ తిట్లతో సమస్యలు పరిష్కారం కావు. వారిని కోర్టుల చుట్టూ తిప్పడం, సమాజం నుంచి దూరంగా పెట్టడం వల్ల పరిస్థితి మారదు. దారి తప్పిన యువతను శిక్షించడం కంటే సరైన మార్గం చూపడమే ఉత్తమం. అందుకే వారిని క్షమిస్తున్నాను, సమాజం కూడా వారిని స్వీకరించాలి." అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాని పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో కిందే అభిజీత్ దిప్కే నేరుగా వ్యాఖ్యానించారు. "కేవలం రీల్స్ లోనే క్షమిస్తారా? లేక విద్యార్థులపై నమోదు చేసిన కేసులను కూడా నిజంగానే వెనక్కి తీసుకుంటారా?" అని నిలదీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దిప్కే మరికొన్ని అంశాలను లేవనెత్తారు. విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కూడా పేపర్ లీకేజీలపై పోరాడుతున్న విద్యార్థులను వేధిస్తున్నారని, నమోదు చేసిన అన్ని కేసులను ఎత్తివేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

అనుచిత భాషను తాము సమర్థించమని, అయితే చిన్న పిల్లలు, యువత భావోద్వేగంలో చేసిన వ్యాఖ్యలకు క్రిమినల్ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడం భావప్రకటనా స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు.

ఇటీవల ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలికపై 'జీరో ఎఫ్‌ఐఆర్' నమోదు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనంతరం ఆ బాలిక తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్తూ వీడియో విడుదల చేసింది. చుట్టూ ఉన్న వారి ప్రభావంతోనే అలా మాట్లాడానని పేర్కొంది.

మరోవైపు, నేర చరిత్ర లేని విద్యార్థులు మరియు మైనర్లను కేసుల నుంచి మినహాయించి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని ప్రకటన తర్వాత విద్యార్థులపై పెట్టిన కేసులు నిజంగానే ఉపసంహరించుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu