Kulkacharla: విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్డుపై.. చీకట్లో విలవిలలాడుతున్న తండా!
వికారాబాద్ జిల్లా: కుల్కచర్ల మండలంలో నిన్న రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
హన్మయా నాయక్ తండాపై ప్రకృతి కన్నెర్ర జేసింది. నిన్న రాత్రి ఒక్కసారిగా వీచిన భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం తండాను వణికించింది. గాలుల తీవ్రత ఎంత ఘోరంగా ఉందంటే.. గ్రామంలోని పలువురి పేదల ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.
ఇళ్లపై ఉన్న రేకుల షెడ్లు గాల్లోకి పక్షి రెక్కల్లా ఎగిరిపోయి దూరంగా పడ్డాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తండా వాసులు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. గాలివాన ధాటికి గ్రామంలోని విద్యుత్ స్తంభాలు, భారీ ట్రాన్స్‌ఫార్మర్లు సైతం విరిగి నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడటంతో తండా అంతా అంధకారంలో మునిగిపోయింది. ఇటు ఇళ్లు లేక, అటు కరెంట్ లేక తండా ఒక్కసారిగా అల్లోకల్లాలంగా మారింది.
రాత్రంతా ఏం జరుగుతుందో తెలియక తండా వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. తమకు జరిగిన ఆస్తి నష్టాన్ని చూసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి.. యుద్ధప్రాతిపదికన గ్రామంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, ఇళ్లు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలని తండా వాసులు డిమాండ్ చేస్తున్నారు.

