Kurnool: కర్నూలులో జూన్ నుండి 'ఆపరేషన్ దండాయన'
కర్నూలు: నేర నియంత్రణే లక్ష్యంగా గట్టిగా పని చేయాలని , ఆదివారం ఐపియల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ల నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలపాల పై గట్టి నిఘా ఉంచాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు పోలీసు అధికారులకు ఆదేశించారు.
శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైల తో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ పోలీసుఅధికారులతో మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తు పదార్దాల నిర్మూలనకు గంజాయి అమ్మే వారిని, సేవించే వారిని గుర్తించేందుకు జిల్లాలో విస్తృతంగా డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో తనిఖీలు నిర్వహించాలన్నారు.
గౌరవ ఏపీ డిజిపి గారి ఆదేశాల మేరకు జూన్ 1 నుండి 30 వరకు ఆపరేషన్ దండాయన కార్యక్రమం అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా లైంగిక నేరస్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. లైంగిక నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉన్న సెక్సువల్ అఫెండర్ల పై షీట్లు ఓపెన్ చేయాలన్నారు. వారికి జియో ట్యాగింగ్ చేయాలన్నారు.
గత ఏడాది కాలంలో శిక్ష పడిన నేరస్తుల వివరాలు సేకరించి వారిపై నిఘా కొనసాగించాలన్నారు. రౌడీషీటర్స్ కు మానిటరింగ్ చేయాలన్నారు. మిస్సింగ్ కేసులు, దొంగలించబడిన వాహనాలను గుర్తించేందుకు RTGS CCTV 360 అప్లికేషన్ ద్వారా వస్తున్న అలర్ట్‌లను ప్రతిరోజూ సమీక్షించాలన్నారు. "CCTV AP 360 అప్లికేషన్ ను సమర్థవంతంగా వినియోగించాలన్నారు.
1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్ పై వెంటనే స్పందించాలన్నారు. 10 లక్షల పైగా జరిగిన సైబర్ మోసాల పై ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసి, వెంటనే దర్యాప్తులు చేపట్టాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన వారి నుండి జరిమానాలు కోర్టుకు మాత్రమే చెల్లించేవిధంగా చూడాలన్నారు.
ఈ విషయం లో ఎవరైనా అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించే వారి పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఒక సంవత్సరం క్రితం బదిలీ అయిన పోలీసు సిబ్బందిని పాత పోలీసు స్టేషన్ లలో కొనసాగించకుండా వారికి కేటాయించిన పోలీసుస్టేషన్లలలోనే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ నేర సమీక్ష సమావేశంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు బాబు ప్రసాద్, వెంకట్రామయ్య , ఉపేంద్రబాబు, భార్గవి , సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

