Kurnool: మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరిక
కర్నూలు: నగరపాలక సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణ లోపం ఉంటే ఇంటికే వెళ్లక తప్పదని కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు.
శుక్రవారం ఆయన 14వ శానిటేషన్ మస్టర్‌ను తనిఖీ చేశారు. అనంతరం చెన్నమ్మ సర్కిల్, బళ్లారి చౌరస్తా, వాణిజ్య నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ క్రమంలో కార్మికుల్లో ఒకరు హాజరు వేసుకుని ఇంటికి వెళ్లడం, మరొకరు మొబైల్‌లో చూస్తూ కాలక్షేపం చేయడాన్ని గమనించిన కమిషనర్, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికి వెళ్లిన ఉద్యోగి జీతం కట్ చేయాలని ఆదేశించారు. చరవాణి చూస్తూ కాలక్షేపం చేస్తే జీతాలు ఇవ్వాలా? హాజరు వేసుకుని ఇంటికి వెళ్తే ఉద్యోగం ఎందుకు? అంటూ సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారు.
పిన్ పాయింట్ ప్రొగ్రాం ప్రకారం పారిశుద్ధ్యాన్ని కచ్చితంగా అమలు చేసి ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధులకు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరు కావడం, పని సమయాల్లో మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేయడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. అనంతరం పరిమళ నగర్‌లోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన కమిషనర్, అక్కడి స్వచ్ఛత, తాగునీటి సరఫరా, భోజన నాణ్యత వంటి అంశాలను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
నగరపాలక కార్యాలయంలో ప్రజలకు కల్పించనున్న వసతులను కమిషనర్ పరిశీలించారు. ఇటీవల ఆయన ఆదేశాల మేరకు కుర్చీలు, వాటర్ కూలర్, హెల్ప్ డెస్క్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యాలయానికి వచ్చే ప్రజలకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉందని, కూర్చోవడానికి కుర్చీలు, తాగడానికి చల్లని నీళ్లు, సహాయం చేయడానికి హెల్ప్ డెస్క్ వంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
అదేవిధంగా వెండర్ జోన్ల ఏర్పాటుకు వెంకటరమణ కాలనీలోని హరిత హోటల్ వెనుక ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు మునిస్వామి, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

