Kurnool: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలి
కర్నూలు: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మండల విద్యాశాఖ అధికారులను, హెడ్ మాస్టర్ లను ఆదేశించారు.
శుక్రవారం పాఠశాలలో విద్యార్థుల నమోదు అంశం పై మండల విద్యాశాఖ అధికారులతో, హెడ్ మాస్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1 నుండి 10వ తరగతి వరకు విద్యార్థుల నమోదును పెంచడానికి లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని, వాటిని సాధించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల నుండి 1వ తరగతికి, అలాగే 5వ తరగతి నుండి 6వ తరగతికి విద్యార్థుల మార్పిడి ఆశించిన స్థాయిలో లేదన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ విషయంలో పురోగతి తీసుకొని రావాలన్నారు..అంగన్‌వాడీ కేంద్రాల నుండి 1వ తరగతిలో విద్యార్థుల చేరికలు పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, ఉపాధ్యాయులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్నాయని వివరించి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమర్థవంతంగా బోధిస్తున్నారని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలే అంగీకరిస్తున్నాయని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
2025-26 విద్యా సంవత్సరానికి గాను 1 నుండి 10వ తరగతి వరకు నమోదు (Enrollment) 2,55,000 ఉంటే, ఈసారి 10% పెంచి 2,81,000 లక్ష్యంగా ఇచ్చారన్నారు. అందులో భాగంగా ఇప్పటికే 2,36,000 వరకు సాధించాం అన్నారు. ఇంకా 45,000 నమోదు చేయాల్సి ఉందన్నారు. 45,000 లో తరగతుల వారీగా మార్పును (Transition) గమనిస్తే, 5వ తరగతి నుండి 6వ తరగతికి వెళ్లే దగ్గర ఎక్కువ గ్యాప్ కనిపిస్తోందన్నారు. మిగిలిన తరగతుల్లో 80% నుండి 90% వరకు సాధించినప్పటికీ, 5 నుండి 6వ తరగతికి మాత్రం కేవలం 56% మాత్రమే సాధించగలిగాం అన్నారు.
అంటే 17,595 మందిని 5 నుండి 6వ తరగతికి పంపాము, ఇంకా 13,510 మంది మిగిలిపోయారన్నారు. పెండింగ్ బ్యాలెన్స్‌ను పూర్తి చేయాలంటే, ప్రైమరీ టీచర్లు ప్రతి విద్యార్థి యొక్క PEN (Permanent Enrollment Number) మరియు ఆధార్ వివరాలను అందించాలన్నారు. MEO లందరూ ఈ విషయంలో శ్రద్ధ వహించి, ఈ ప్రక్రియను ఈరోజు లోపే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిఈఓ సుధాకర్, డిప్యూటీ డిఈఓ లు, మండల విద్యాశాఖ అధికారులు, హెడ్ మాస్టర్ లు పాల్గొన్నారు.

