Madanapalle: పోలీసుల మెరుపు దాడి: అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు!
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పోలీసులు రెండు వేర్వేరు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి భారీ మొత్తంలో బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు.
మదనపల్లె పట్టణంలోని గోవర్ధనగిరి శ్రీకృష్ణుడి ఆలయంలో చోరీకి పాల్పడిన నలుగురు అంతర్రాష్ట్ర నిందితులను మదనపల్లి రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువ చేసే బంగారం, నాలుగు కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన హనికేత్ బృందం కూలి పనుల కోసం మదనపల్లెకు వచ్చి ఈ ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.
ఇక వాల్మీకిపురం మండలంలో జరిగిన మరో కేసులో, రెండు ఇళ్లలో చోరీలు మరియు చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడిన రెడ్డప్పతో పాటు మరో ఇద్దరిని వాల్మీకిపురం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.11 లక్షల విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను కూడా ఎస్పీ అభినందించారు. రెండు వేర్వేరు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జిల్లాలో పోలీసుల చురుకుదనాన్ని ప్రతిబింబిస్తోంది.

