మామిడికుదురు: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని పంజషా ఆషూర్ఖానాలో ఆదివారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఆషూర్ఖానాలకు ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పి.
గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా నగరం గ్రామంలోని 45 ఆషూర్ఖానాలకు ఒక్కో దానికి రూ.5,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 190 ఆషూర్ఖానాలకు ఆర్థిక సాయం అందించగా, ఈ ఏడాది ఆ సంఖ్యను 251కు పెంచినట్లు తెలిపారు. మొహర్రం సందర్భంగా ఆషూర్ఖానాల నిర్వహణ కోసం ముస్లిం సోదరులకు ఈ సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో ఇలాంటి ఆర్థిక సాయం ఎప్పుడూ అందించలేదని, కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు. అలాగే వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్, తాలీమ్-ఎ-హునర్ వంటి కార్యక్రమాల ద్వారా పేద ముస్లిం మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖరం హుస్సేన్, అబేద్ ఆలీ, కిశ్వర్ కాజారాని, అబ్బాస్ అలీ, ఫాకర్ సాహెబ్, సజ్జాద్ హుస్సేన్, పలువురు ముస్లిం ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

