Mancherial: మంచిర్యాల ఆయుష్ శాఖలో 10 పోస్టుల భర్తీ దరఖాస్తులకు ఆహ్వానం
మంచిర్యాల: జిల్లాలో ఆయుష్ శాఖ పరిధిలో పొరుగు సేవల పద్ధతిలో 10 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
ఈ నెల 27వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
భర్తీ చేయనున్న పోస్టుల్లో 4 మెడికల్ ఆఫీసర్లు, ఒక ఫార్మసిస్ట్, ఒక సైకోసోషల్ కౌన్సిలర్, ఒక యోగా ప్రొఫెషనల్, 3 మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులు ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు.
మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, నేచురోపతిలో సంబంధిత విద్యార్హతతో పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టుకు డి.ఫార్మసీ, బి.ఫార్మసీ లేదా ఫార్మా-డి అర్హతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో నమోదు తప్పనిసరి. సైకోసోషల్ కౌన్సిలర్ పోస్టుకు సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ, యోగా ప్రొఫెషనల్ పోస్టుకు నిర్దేశిత విద్యార్హతలు ఉండాలి. మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు సైకిల్ లేదా మోటార్ సైకిల్ నడపగలిగే సామర్థ్యం ఉండాలని పేర్కొన్నారు.
దరఖాస్తుతో పాటు విద్యార్హత ధ్రువపత్రాలు, వర్తించే సందర్భంలో కుల ధ్రువీకరణ పత్రం, ఇతర అవసరమైన పత్రాలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు సమర్పించాలి. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వెయిటేజీ, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను జిల్లా అధికారిక వెబ్‌సైట్ \\*https://www.mancherial.telangana.gov.in\\* లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులకు సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 28వ తేదీన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని పూర్తి అర్హతలు, నిబంధనలు, రిజర్వేషన్లు, ఎంపిక విధానాన్ని పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.

