Dailyhunt
మంచి మనసుకు మరోపేరు సావిత్రి...పీవీ నరసింహారావే స్వయంగా అలా చేశారు

మంచి మనసుకు మరోపేరు సావిత్రి...పీవీ నరసింహారావే స్వయంగా అలా చేశారు

hmtv 2 weeks ago

Savitri's Kind Heart: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఔదార్యం అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది సావిత్రి. వెండితెరపై మహానటిగా వెలిగిన సావిత్రి అటు మానవత్వంలోనూ మేటిగా నిలిచారు.

సంపాదనను లెక్కచేయకుండా, ఆపదలో ఉన్నవారికి అడగకముందే సాయం చేయడం ఆమె నైజంగా మారింది. సావిత్రి దాతృత్వానికి సంబంధించి 1972లో జరిగిన ఓ అరుదైన సంఘటన నేటికీ సినీ, రాజకీయ వర్గాల్లో ఓ మధుర జ్ఞాపకంగా మిలిగిపోయింది.

పీవీ నరసింహారావు దండ.. సావిత్రి ఔదార్యం

అది 1972వ సంవత్సరం. దేశ రక్షణ నిధి కోసం నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులతో పీవీ నరసింహారావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వేదికపై పీవీ మెడలో ఉన్న పూలదండను వేలం వేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఎం.జి.ఆర్ వంటి దిగ్గజాలు ఉన్న ఆ సభలో, సావిత్రి గారు ఏకంగా 32,000 రూపాయలు వెచ్చించి ఆ దండను దక్కించుకున్నారు. ఆ రోజుల్లో 32 వేల రూపాయలు అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమె దేశభక్తికి, పెద్ద మనసుకు ముగ్ధుడైన పీవీ నరసింహారావు గారు, స్వయంగా ఆ దండను తిరిగి సావిత్రి గారి మెడలోనే వేసి గౌరవించారు. ఒక ముఖ్యమంత్రి ఒక నటిని అలా గౌరవించడం అప్పట్లో పెద్ద సంచలనం.

పనిమనిషిలో తల్లిని చూసిన మహానటి

సావిత్రి మంచి మనసును చెప్పే మరో సంఘటన కూడా ఒకటి జరిగింది. సావిత్రి ఇంట్లో పనిచేసే వంటావిడ పట్ల ఆమె ప్రదర్శించిన తీరు కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. గతంలో ఉన్నత స్థితిలో ఉండి, కష్టాల్లో పడి పనికి కుదిరిన ఆ మహిళకు సావిత్రి యజమానిలా కాకుండా ఒక కూతురిలా అండగా నిలిచారు. "మా ఇంట్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు" అని ఆమెకు ధైర్యం చెప్పడమే కాకుండా, తన పిల్లల బాధ్యతను కూడా ఆమెకే అప్పగించి ఒక కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారు. ఇంటికి వచ్చే అతిథులకు కాదు అనకుండా వడ్డించేవారు. ఆరోజుల్లోనే నెలకు సుమారు 50 వేల రూపాయలు ఖర్చుచేశారంటే అర్ధం చేసుకోవచ్చు.

మొత్తంగా చెప్పాలంటే...సినిమా రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, సామాన్యుల పట్ల కరుణ చూపడంలో సావిత్రి ఎప్పుడూ ముందుండేవారు. డబ్బును కేవలం అవసరాలకు వాడుకునే సాధనంగానే చూశారు తప్ప, దాచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఆస్తులు కరిగిపోయినా, తెలుగు వారి గుండెల్లో ఆమె సంపాదించుకున్న 'మహానటి' అనే ఆస్తి మాత్రం శాశ్వతంగా ఉండిపోయింది. సావిత్రి అంటే కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఒక స్వచ్ఛమైన మానవత్వానికి చిరునామా! సావిత్రి వంటి మానవత్వం మనలో కూడా ఉండాలని కోరుకుందాం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu