Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mangalagiri: మంగళగిరిలో 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయుల ర్యాలీ

Mangalagiri: మంగళగిరిలో 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయుల ర్యాలీ

hmtv 3 weeks ago

మంగళగిరి: రాష్ట్రవ్యాప్తంగా 1998 ఎంఎటీఎస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం మంగళగిరిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. 1998 ఎంఎటీఎస్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డెపు కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 600 మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రారంభమైన శాంతియుత ర్యాలీ విద్యాభవన్ వరకు సాగింది. అనంతరం ఉపాధ్యాయుల ప్రతినిధులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను కలిసి తమ సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా బుడ్డెపు కామేష్ రెడ్డి మాట్లాడుతూ, 1998లో నియమితులైన వేలాది మంది ఎంఎటీఎస్ ఉపాధ్యాయులు దాదాపు మూడు దశాబ్దాలుగా విద్యా సేవలు అందిస్తున్నప్పటికీ ఇప్పటికీ పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగంలో చేరిన తర్వాత అనేక మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం పదవీ విరమణ దశకు చేరుకుంటున్నారని, వారి సేవలను గుర్తించి సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు.

ప్రస్తుతం ఏడాదిలో 11 నెలలకే వేతనాలు చెల్లిస్తున్నారని, దీనిని 12 నెలలకు విస్తరించి పూర్తి వేతన ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు పెన్షన్ సదుపాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గత ఏడాది సమీప మండలాల్లో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులను దూర ప్రాంతాలకు బదిలీ చేశారని, వయస్సు, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వారిని తిరిగి సమీప మండలాలకు బదిలీ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,072 మంది ఎంఎటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు విద్యాశాఖ కమిషనర్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

ఉపాధ్యాయుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, పదవీ విరమణ అనంతర జీవన భరోసా కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు పలకడం విశేషం. తమ సమస్యల పరిష్కారం వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సంఘం నాయకులు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu