Dailyhunt
MI vs LSG : హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. ముంబై ప్లేఆఫ్ ఆశలు సజీవం.. లక్నోకి ఆరో షాక్

MI vs LSG : హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. ముంబై ప్లేఆఫ్ ఆశలు సజీవం.. లక్నోకి ఆరో షాక్

hmtv 6 days ago

MI vs LSG

MI vs LSG

MI vs LSG : ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో కుంగిపోయిన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు ఎట్టకేలకు ఒక తీపి కబురు అందింది. వాంఖడే స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై అద్భుత విజయాన్ని అందుకుంది.

ముఖ్యంగా గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ తన ఫామ్‌తో ముంబైకి మళ్లీ ఊపిరి పోశాడు. మరోవైపు లక్నో జట్టుకు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఒకానొక దశలో లక్నో 250 పరుగులు దాటుతుందనిపించింది. నికోలస్ పూరన్ కేవలం 21 బంతుల్లోనే 63 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న పూరన్ ఇన్నింగ్స్‌లో 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. మిచెల్ మార్ష్ (44), జోష్ ఇంగ్లిస్ కూడా ధాటిగా ఆడటంతో లక్నో స్కోరు బోర్డు పరుగులు తీసింది. అయితే చివరి 10 ఓవర్లలో ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో లక్నో ఆశించిన దానికంటే 20 పరుగులు తక్కువే చేసింది.

రోహిత్-రికెల్టన్ జోడీ విశ్వరూపం

229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, రాయన్ రికెల్టన్ కలలో కూడా ఊహించని ఆరంభాన్ని ఇచ్చారు. గాయం కారణంగా గత 5 మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మ, రీ-ఎంట్రీలో పాత రోహిత్‌ను తలపించాడు. కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, మరోవైపు రికెల్టన్ 22 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ దాటాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 10.4 ఓవర్లలోనే 143 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు. రికెల్టన్ 32 బంతుల్లో 83 పరుగులు చేయగా, రోహిత్ 44 బంతుల్లో 84 పరుగులు సాధించాడు.

ముంబై కీలక విజయం.. లక్నో పతనం

రోహిత్, రికెల్టన్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ త్వరగానే వెనుదిరిగినప్పటికీ ముంబై ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు. నమన్ ధీర్ (12 బంతుల్లో 23 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హార్దిక్ పాండ్యా లేని లోటు తెలియకుండా ముంబై ఈ మ్యాచ్ గెలవడం విశేషం. ఈ విజయంతో ముంబై తన ప్లేఆఫ్ ఆశలను స్వల్పంగా పెంచుకోగా, వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన లక్నో పరిస్థితి మరింత దిగజారింది.

బౌలింగ్‌లో ముంబై మెరుగు

భారీ స్కోర్లు నమోదయ్యే వాంఖడే పిచ్‌పై ముంబై బౌలర్లు సెకండ్ హాఫ్‌లో పుంజుకోవడం జట్టుకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా కార్బిన్ బాష్ 2 వికెట్లు తీసి లక్నో జోరుకు బ్రేకులు వేశాడు. గతరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌తో ముంబై మళ్లీ గెలుపు బాట పట్టడం ఫ్యాన్స్‌కు పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu