Nalgonda: ఉద్యోగం కావాలంటే 2 లక్షలు అడిగారా? నల్గొండలో వెలుగుచూసిన భారీ దందా
నల్లగొండ జిల్లా: నిరుద్యోగుల ఆశలే పెట్టుబడిగా, దేవాదాయ శాఖ పేరిట అక్షరాలా రూ.
20 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టిన భారీ కుంభకోణం నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది. ఉద్యోగాల పేరిట నమ్మించి వందలాది మందిని నిలువునా ముంచేసిన 'శాలరీ బాక్స్' యాప్ ముఠా బాగోతం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే..
నకిరేకల్, కట్టంగూర్, కేతపల్లి, తిప్పర్తి మండలాలకు చెందిన అమాయక ప్రజలే లక్ష్యంగా కేటుగాళ్లు వల విసిరారు. దేవాదాయ శాఖలో హుండీ లెక్కింపు, ఇతర విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. బాధితులను నమ్మించేందుకు 'శాలరీ బాక్స్' అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, అందులోనే హాజరు నమోదు చేయాలని సూచించారు. నెలలు గడుస్తున్నా నియామక పత్రాలు అందకపోవడం, జీతాలు రాకపోవడంతో బాధితుల్లో అనుమానం మొదలైంది. తీరా ఆరా తీస్తే అదంతా మాయ అని తేలిపోయింది..
నట్టేట మునిగిన సామాన్యులు..
కరీంనగర్‌కు చెందిన పులి రవి ప్రధాన నిందితుడిగా భావిస్తుండగా.. శంకరయ్య, జనార్ధన్, నగేష్ అనే వ్యక్తులు ఈ దందాలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అప్పులు తెచ్చి, ఆభరణాలు అమ్మి కట్టిన సొమ్ము ఆవిరి కావడంతో మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాధితులు శనివారం నకిరేకల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

