Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nellore: ఆర్టీసీ ప్రైవేటుపరం వద్దు.. ప్రభుత్వంపై మజ్దూర్ యూనియన్ ఆగ్రహం

Nellore: ఆర్టీసీ ప్రైవేటుపరం వద్దు.. ప్రభుత్వంపై మజ్దూర్ యూనియన్ ఆగ్రహం

hmtv 4 days ago

Nellore: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన ఏపీఎస్ఆర్టీసీ ను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వాల నిర్ణయంతో మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని నేషనల్ మజ్దూర్ యూనియన్ నెల్లూరు జోనల్ అధ్యక్షులు కొన్నెపాటి పద్మారావు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ చైర్మన్ సంస్థను ప్రైవేటు పరం చేయాలని ఇటీవల చేసిన ప్రకటనపై నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపో ఎదుట నాయకులు, కార్మికులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా హాజరైన ఎన్ఎంయు జోనల్ అధ్యక్షులు కొన్నెపాటి పద్మారావు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది అన్నారు. అలాంటి సంస్థను ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించి నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి నిర్వహించాలన్నారు. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఈ.హెచ్.ఎస్ వైద్య విధానంలోకి వారిని విలీనం చేశారన్నారు. దీని ద్వారా తమకు రెండు మూడు లక్షల వరకు మాత్రమే వైద్యం పరిమితమైందని, గతంలో ఉన్న వైద్య విధానంలో 30, 40 లక్షల వరకు క్లైమ్ చేసుకునే అవకాశం ఉండేది అన్నారు. అందువల్ల పాత వైద్య విధానమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా ప్రవేశపెట్టిన శ్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతుందని తెలిపారు.

ఇందుకు ఆర్టీసీ కార్మికుల శ్రమ, సహకారం ఎంతగానో ఉందన్నారు. ఈ పథకం ప్రవేశపెట్టి ఏడాది గడుస్తుండడంతో ప్రభుత్వం వద్ద అంచనా ఉంటుందన్నారు. దాని ప్రాతిపదికన మహిళలకు జీరో టికెట్టు నిలుపుదల చేసి పురుషులకు మాత్రమే టికెట్లు కొట్టే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగినా బస్సుల సంఖ్య, కార్మికుల సంఖ్య పెంచడంలో ప్రభుత్వం దృష్టి సారించలేదని తెలిపారు. పాడైపోయిన బస్సులతోనే అగచాట్లు పడుతూ ఆర్టీసీ అధికారులు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెరిగిన ప్రయాణికుల దృష్ట్యా అదనపు బస్సులు, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం కానీయకుండా ఎన్ని సంఘాలు తమతో కలిసి వచ్చినా ఉద్యమించే దానికి తాము సిద్ధంగా ఉన్నామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎంయు డిపో సెక్రటరీ మస్తానయ్య, గ్యారేజీ సెక్రటరీ అహ్మద్ భాషా, సుధీర్, జమీర్, గౌస్ బాషా, ఖాదర్ బాషా, శ్రీహరి, ఇతర కార్మికులు నాయకులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu