Nellore: వైఎస్సార్ మరణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు.
17 ఏళ్ల తర్వాత వైఎస్సార్ మరణంపై కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడిపై ఆరోపణలు చేయడం రాజకీయాల్లో దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలు చూసి వైసీపీ నాయకులే విస్తుపోతున్నారని, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
వైఎస్సార్ మరణించిన సమయంలో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని సోమిరెడ్డి గుర్తుచేశారు. వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడైన రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని, ఆయన విజ్ఞప్తి మేరకే కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించిందని పేర్కొన్నారు. సమగ్ర విచారణ అనంతరం అది హెలికాప్టర్ ప్రమాదమేనని సీబీఐ స్పష్టమైన నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితుల్లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సీబీఐని ప్రభావితం చేశారనే వాదన ఎంతవరకు సమంజసమో జగన్ ఆలోచించుకోవాలని ప్రశ్నించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలోనూ జగన్‌పై సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. చిన్నాయన హత్యకు గురైన తర్వాత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అసలు హంతకులను ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నించారు. మరోవైపు వివేకా కుమార్తె సునీత న్యాయం కోసం పులివెందుల నుంచి ఢిల్లీ వరకు పోరాడుతున్నారని, ఆమె పోరాటస్ఫూర్తి ప్రశంసనీయం అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యురాలు న్యాయపోరాటం చేస్తుంటే జగన్ మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు.
ఇక జగన్ కుటుంబ చరిత్ర, పులివెందుల రాజకీయాలపై కూడా సోమిరెడ్డి ప్రస్తావించారు. 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం దురుద్దేశపూరిత రాజకీయమని విమర్శించారు. ప్రజలు అమాయకులు కారని, ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో గమనిస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, మరణాలపై ఆధారంలేని అనుమానాలు వ్యక్తం చేయడం సమంజసం కాదని, ప్రజలు నిజానిజాలను అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

