Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nellore: మెడికల్ షాపుల సంపూర్ణ బంద్.. ఈ-ఫార్మసీలపై కెమిస్టుల ఆగ్రహం!

Nellore: మెడికల్ షాపుల సంపూర్ణ బంద్.. ఈ-ఫార్మసీలపై కెమిస్టుల ఆగ్రహం!

hmtv 4 days ago

Nellore: మెడికల్ షాపుల సంపూర్ణ బంద్.. ఈ-ఫార్మసీలపై కెమిస్టుల ఆగ్రహం!

నెల్లూరు: దేశవ్యాప్తంగా ఔషధ వ్యాపార రంగాన్ని కాపాడాలని కోరుతూ, AIOCD మరియు APCDA పిలుపు మేరకు, మే 20న నిర్వహించిన భారత్ బంద్ కు SPSR నెల్లూరు జిల్లా కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది.

ఫార్మసీ రంగం ప్రస్తుతం ఎన్నో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, సంఘం నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా AI ఆధారిత నకిలీ ప్రిస్క్రిప్షన్లు, అనధికారిక ఆన్‌లైన్ మందుల విక్రయాలు, యాంటీబయోటిక్స్ దుర్వినియోగం, ఫార్మసీ చట్టాల అమలులో లోపాలు, రోగుల భద్రతకు ముప్పుగా మారుతున్న అక్రమ కార్యకలాపాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న GSR 220(E) నిబంధనల కారణంగా చిన్న మరియు మధ్య తరహా మెడికల్ షాపులపై అదనపు భారం పడుతోందని, సంఘం అభిప్రాయపడింది. ఔషధాల నిల్వ, రికార్డు నిర్వహణ, లైసెన్సింగ్ మరియు నియంత్రణల విషయంలో తీసుకొస్తున్న మార్పులు గ్రామీణ మరియు చిన్న పట్టణాల్లో పనిచేస్తున్న రిటైల్ కెమిస్టుల మనుగడను సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

అలాగే GSR 817(E) నిబంధనల అమలులో స్పష్టత లేకపోవడం వల్ల ఫార్మసిస్టులు మరియు వ్యాపారులు అనేక పరిపాలనా సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకొస్తున్న నియంత్రణలు ప్రజారోగ్య రక్షణకు ఉపయోగపడాలి గానీ, చిన్న వ్యాపారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉండకూడదని స్పష్టం చేశారు.

రోగుల ప్రాణ భద్రతను కాపాడటంలో ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకమని, సరైన నియంత్రణలు లేకుండా ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలు కొనసాగితే ప్రజారోగ్య వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా ప్రిస్క్రిప్షన్ మందులు నిర్బంధ నియంత్రణల లేకుండా అందుబాటులోకి రావడం వల్ల యువతలో మందుల దుర్వినియోగం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఫార్మసీ రంగంలో పనిచేస్తున్న వేలాది చిన్న కెమిస్టుల జీవనోపాధిని పరిరక్షించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని, అక్రమ ఆన్‌లైన్ విక్రయాలను అరికట్టాలని, రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల హక్కులను కాపాడాలని సంఘం డిమాండ్ చేసింది.

బంద్ సందర్భంగా జిల్లాలోని మెడికల్ షాపుల యజమానులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి ఐక్యతను చాటారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని అవసరమైన మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంచినట్లు సంఘం తెలిపింది. అపోలో ఫార్మసీ యాజమాన్యం కూడా ఆసుపత్రులలోని షాపులను మినహాయించి మిగతా షాపులను బంద్‌కు సహకరించడం పట్ల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పేరూరి ప్రదీప్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, నరేంద్ర మరియు కార్యవర్గ సభ్యులు అశోక్, అయిత భాస్కర్, అనీల్, సుధా తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu