"నీటి సరఫరా కట్ చేస్తాం" అంటూ మెసేజ్.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.4.19 లక్షల టోకరా!
Hyderabad: ఎల్బీనగర్ సమీపంలోని రాక్ టౌన్ కాలనీలో నివసిస్తున్న విశ్రాంత బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి కంచర్ల సత్తిరెడ్డి రూ.4.19 లక్షలు సైబర్ నేరగాళ్ల చేతిలో పోగొట్టుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 1న బాధితుడికి "జలమండలి తాగునీటి బిల్లు చెల్లించలేదు. నీటి సరఫరా తొలగిస్తున్నాము" అంటూ ఓ వాట్సప్ మెసేజ్ వచ్చింది. దాంతో పాటు వివరాలకు సంప్రదించాలంటూ ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు.
సత్తిరెడ్డి ఆ నంబర్‌కు కాల్ చేయగా అవతలి వ్యక్తి తన పేరు వివేక్ శర్మ అని చెప్పి, నీటి మీటర్ KYC అప్డేట్ చేయాలంటూ UPI, SBI ఖాతా, ATM కార్డు వివరాలు అడిగాడు. నిజమేనని నమ్మిన బాధితుడు వివరాలు ఇచ్చారు.
అనుమానం వచ్చి ఫోన్ డిస్కనెక్ట్ చేసినా, అప్పటికే బాధితుడి ఫోన్లో జలమండలి పేరిట 2 మొబైల్ యాప్‌లు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయ్యాయి. OTP, PIN ఏమీ చెప్పకపోయినా బ్యాంకు ఖాతా నుంచి రూ.4.19 లక్షలు మాయమయ్యాయి.
వెంటనే బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల హెచ్చరిక:
1. జలమండలి, కరెంట్, గ్యాస్ పేరుతో వచ్చే వాట్సప్ మెసేజ్‌లు, కాల్స్‌ను నమ్మవద్దు.
2. ఫోన్‌లో తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు. లింక్‌లు క్లిక్ చేయవద్దు.
3. OTP, ATM PIN, UPI PIN, కార్డు వివరాలు ఎవరికీ చెప్పవద్దు.
4. అనుమానం వస్తే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ కు కాల్ చేయండి.
5. అధికారిక సమాచారం కోసం జలమండలి వెబ్‌సైట్ లేదా కార్యాలయాన్ని మాత్రమే సంప్రదించండి.

