Off The Record: గుంటూరు టీడీపీ లో అవినీతి తిమింగిలాలు?
Off The Record: గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులుపై జోరుగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట.
తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఈ లీడర్లు.. ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి కన్నా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎక్కువగా తాపత్రాయ పడుతున్నారనే వార్తలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా గుప్పుమంటున్నాయట. ఓట్లేసి గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి నీకింత, నాకింత అనే పంపకాలపైనే దృష్టి పెడుతున్నారని, ప్రతి పనికి.. ఓ రేట్ ఫిక్స్ చేసుకొని.. ఖనాజా నింపుకోవడం కోసమే పరుగులు పెడుతున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.
గత ఎన్నికలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. సివిల్స్ అధికారిగా పని చేసిన రామాంజనేయులు ప్రత్తిపాడు నుంచి, సామాజిక సమీకరణాలు కలిసొచ్చి నజీర్ అహ్మద్.. గుంటూరు ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. రాజధాని ప్రాంతం ఉన్న జిల్లా కావడం, పైగా కేంద్రమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు కావడంతో రాష్ట్ర ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఎమ్మెల్యేలుగా పని చేయడం అంటే...ఇంకాస్త కేర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం..
కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు దూరంగా.. దారి తప్పి నియోజకవర్గంలో పాలన సాగిస్తున్నారనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని పార్టీ కేడర్ తో.. సహా అందరూ ఆశించారు. అయితే వారి రూటు దారి మళ్లిందట. సంపాదనే లక్ష్యంగా వారి ఆలోచనలు ముందుకు వెళ్లాయట. అంతే.. జిల్లాలోనే ఆ ఇద్దరి గురించి చర్చ మొదలైంది. తన.. మన అనే తేడా లేదు. సంపాదనే వారి లక్ష్యమట. ఎన్నికల్లో ఖర్చు చేసాం.. తిరిగి రాబట్టుకోవాలనేదే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారనే విమర్శల్ని మూటగట్టుకుంటున్నారు.
గెలిచిన పార్టీలో అంతగా సంబంధాలు లేవు. గెలిచిన తరువాత వాటిని బలోపేతం చేసుకునే ఆలోచనలు చేయటం లేదు. వారి ఫోకస్ అంతా సంపాదన మీదనే ఉందట. ఏ పని కావాలన్నా రేటు ఫిక్స్ చేసుకోవాల్సిందేనట. ప్రజలతో ఎలాగో వారికి నేరుగా సంబంధాలు లేవు. పార్టీ ఖరారు చేసిన అభ్యర్ధులుగా వారి గెలుపు కోసం పని చేసిన కేడర్ కూ గుర్తింపు లేదట. ఎవరు ఏ పని మీద వచ్చినా.. వారికి ఏం ఇస్తారో ముందుగా నిర్ణయించుకొని వెళ్లాల్సిందేనట. అత్యున్నత స్థాయి ఉద్యోగం చేసి ఎమ్మెల్యే అయిన ఆ ఎమ్మెల్యే తీరు మరీ జుగుప్సాకరంగా మారిందట. జిల్లా కేంద్రంలో శివారు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అయితే తన నియోజకవర్గంలో పోలీస్ పోస్టింగ్, ఇళ్ళ స్థలాలు సెటీల్మెంట్,ఇళ్ళ నిర్మించుకోవాలంటే ముందుగా తన అనుమతి తీసుకోవాల్సిందే అన్నంతగా రెచ్చిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎమ్మార్వో కార్యాలయంలో ఇచ్చే సర్టిఫికెట్ల నుంచి నియోజకవర్గ పరిధిలో ఏ పోస్టింగ్ అయినా ఆ ఎమ్మెల్యే చెబితేనే చేయాలట. ఈ నియోజకవర్గ పరిధిలో పోస్టింగ్ కావాలంటే.. ముందుగా ఎమ్మెల్యేకు కప్పం కట్టాలనే వాదన జిల్లాలో వినపడుతోంది. ఇక.. నెల నెలా రేషన్ మాఫియా నుంచి మామూళ్లు క్రమం తప్పకుండా అందాల్సిందేనట. ఇక... పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే... మట్టిని బంగారంగా మార్చుకుంటున్నారనే అపవాదును తగిలించుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గంలో మట్టి.. గ్రావెల్.. దుమ్ము.. ధూళి అన్నింటినీ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇక్కడ ఎమ్మెల్యే అల్లుడు గారి గిల్లుడు దెబ్బకు అందరూ షాక్ అవుతున్నారట. దీని కోసమా ఎవరో తెలియకపోయినా.. అన్నింటినీ భరించి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నది అంటూ వాపోతున్నారట స్తానిక కేడర్..
ఇప్పటికే ఈ ఇద్దరి వ్యవహారం జిల్లాలో వైరల్ అవుతోంది. పార్టీ అధినాయకత్వానికి తెలిసింది. పద్దతి మార్చుకోవాలనే వారికి హెచ్చరికలు వచ్చాయి. అయినా.. డోంట్ కేర్. మా దారి మాదే అన్నట్లుగా వారిద్దరూ వ్యవహరిస్తున్నారట. అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా వారి పరిస్థితి మారిపోయిందట. వచ్చే మూడేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగుతాం. అప్పటి పరిస్థితికి అనుగుణంగా క్యాష్ అండ్ క్యారీ విధానంలో సీటు తెచ్చుకుంటామని ఓపెన్ గా చెప్పేస్తున్నారట. దీంతో ఈ ఇద్దరి తీరు ఇప్పుడు నియోజకవర్గంలోనే కాదు పార్టీలోనూ సంచలనంగా మారుతోందట.

